ఇదే నిజం, నేషనల్ బ్యూరో: బలహీన ప్రభుత్వాలు ఉంటే దేశం కూడా బలహీనపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మంగళవారం జార్ఖండ్‌లోని కొడెర్మాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ లాంటి బలహీన ప్రభుత్వాలు దేశానికి ఎన్నడూ మేలు చేయవన్నారు. జార్ఖండ్ ప్రజలు ఇలాంటి బలహీన ప్రభుత్వాలను చాలా చూశారని మోడీ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే దేశంలో టెర్రరిజం పెరిగింది. నక్సలిజం దేశానికి చేటు చేయడమే కాకుండా ఎందరో తల్లుల కలలనూ చిదిమివేస్తుంది. తప్పుడు పనులు చేయడంలో జేఎంఎం, కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమి ఆదర్శంగా నిలుస్తారు. జార్ఖండ్ మంత్రి పీఏకు చెందిన పనిమనిషి ఇంట్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. నిజజీవితంలో పెద్దసంఖ్యలో నోట్లను తాను చూడలేదు. టీవీలోనే తొలిసారి చూశా. ఇలాంటి వ్యక్తులను రాజ కుటుంబం వెనకేసుకొస్తోంది. ఇలాంటి అక్రమార్కుల సంపదను తాను తవ్వి తీస్తాను’అని మోడీ హామీ ఇచ్చారు.
వారణాసిలో నామినేషన్.. పండుగలా ర్యాలీ
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తన సిట్టింగ్ సెగ్మెంట్ వారణాసిలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోడీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీయే నేతలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు మోడీ వెంట ఆర్వో ఆపీసుకు వచ్చారు. అంతకుముందు నామినేషన్ ర్యాలీని పండుగలా నిర్వహించారు. వారణాసి నుంచి మోడీ నామినేషన్ వేయడం వరుసగా ఇది మూడోసారి. నామినేషన్ దాఖలుకు ముందు మోడీ గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయన గంగా హారతి నిర్వహించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం అక్కడే క్రూజ్ షిప్‌లో మోడీ పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఏడో దశలో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసిలో కాంగ్రెస్ నుంచి యూపీ రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడు అజయ్‌రాయ్ నిలబడిన సంగతి తెలిసిందే. మోడీపై ఈయన పోటీ చేయడం వరుసగా మూడోసారి. 2014లో ప్రధాని తొలిసారి ఇక్కడ పోటీ చేయగా.. 56 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్ రాయ్‌కి కేవలం 75వేల ఓట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. ఇక, 2019 ఎన్నికల్లో ప్రధానికి 63 శాతం ఓట్లు రాగా.. అజయ్‌రాయ్‌కి 14శాతం ఓట్లు దక్కాయి.
మోడీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లు
వారణాసిలో నామినేషన్ వేసిన మోడీ.. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వివరించారు. సొంత ఇల్లు, కారు లేదని పేర్కొన్న మోడీ.. తన మొత్తం ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు పైగా ఉన్నట్లు అందులో వెల్లడించారు. తన ఆస్తిలో ఎక్కువ భాగం రూ.2.86 కోట్లు ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. గాంధీనగర్, వారణాసిలో ఉన్న తన బ్యాంకు ఖాతాల్లో రూ.80,304 ఉందని వెల్లడించారు. అవికాక ప్రస్తుతం తన వద్ద రూ.52,920 డబ్బు, రూ.2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మోడీ.. 1978లో డిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.. 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు.
పదేళ్లలో కాశీతో అనుబంధం పెరిగింది
నామినేషన్ దాఖలు సందర్భంగా మోడీ మంగళవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. కాశీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఓ నేషనల్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మారుస్తారంటూ విపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను మోడీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగ పరిరక్షకుడనని ఆయన చెప్పారు. ‘కాశీ’ అనేది కేవలం ఒక మాట కాదని, అదొక భావోద్వేగమన్నారు. ‘కాశీ ఎప్పటికీ చెక్కుచెదరదు. శతాబ్దాలుగా ఇది జనావాసంగా ఉంది. పదేళ్లుగా కాశీతో నాకు అనుబంధం పెరుగుతూ వచ్చింది. గంగా మాత అక్కున చేర్చుకుందనే అనుభూతి నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తోంది. నేను ఎగ్జిట్ కాకముందే వాళ్లు ఇలాంటివి మొదలుపెట్టారు. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా వారు ఇదే తీరు కొనసాగిస్తారని అనుకుంటున్నా’ అని విపక్షాలను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు.