- సెప్టెంబర్ 5 న విచారణకు హాజరు కావాలని ఆదేశం
- హరీశ్ రావు, స్మిత సబర్వాల్, రజత్ కుమార్ సహా మొత్తం 8 మందికి..
- మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వ్యవహారంలోనే..
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా మరో 8 మందికి భూపాలపల్లి సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రి హరీశ్ రావు అధికారులు స్మిత సబర్వాల్, రజత్ కుమార్ కూడా ఉన్నారు. సెప్టెంబర్ 5 న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నాగవెల్లి రాజలింగమూర్తి వేసిన రివిజన్ పిటిషన్ ను భూపాలపల్లి సెషన్స్ కోర్టు స్వీకరించింది. సెప్టెంబర్ 5వ తేదీన ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది. గత ఏడాది అక్టోబర్ 25న మేడిగడ్డ కుంగుబాటుపై పీఎస్ లో ఫిర్యాదు నమోదు చేశానని.. తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని రాజలింగమూర్తి పిటిషన్ లో తెలిపారు. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టుకెక్కినట్లు తెలిపారు. మొదట ఈ విషయంలో ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా.. తన పిటిషన్ ను జడ్జి కొట్టేశారని తెలిపారు. దీంతో తాను హైకోర్టుకు వెళ్లగా.. ఓ రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సూచించిందని తెలిపారు. అందుకే తాను రివిజన్ పిటిషన్ వేసినట్లు తెలిపారు.