COVID-19 Vaccine Diet : కరోనా వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి.
టీకా వేసుకోవడానికి మొదట్లో భయపడిన జనాలు ఇప్పుడు వ్యాక్సిన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
యువత కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయినా ఇంకా కొంతమందిలో మాత్రం భయాలు పోవట్లేదు.
దీనికి కారణం.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు రోజులు కొంతమందిలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి దుష్ప్రభవాలు కనిపించడమే.
అయితే వ్యాక్సినేషన్‌కు ముందు, తర్వాత ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
మరి ఆ ఆహారమేంటో ఇప్పుడు చూద్దాం..
వీటికి దూరంగా ఉండాలి
- ధూమపానం
- మద్యపానం
- ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ తీసుకోవద్దు
- కెఫిన్ ఉన్న డ్రింక్స్ తీసుకోవద్దు
పసుపు
పసుపు సర్వరోగ నివారిణి. నొప్పులను తగ్గించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
అందుకే పూర్వకాలం నుంచి మన వంటల్లో పసుపును వినియోగిస్తున్నాం. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
అందువల్ల వ్యాక్సినేషన్‌కు ముందు ఆహారంలో పసుపు తీసుకోవడం చాలా ముఖ్యం. పాలల్లో పసుపు వేసుకుని తాగిన చక్కటి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి
రోగనిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి దోహదపడుతుంది. ఇది ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది.
జీర్ణక్రియను మెరుగుపరిచే గట్ బ్యాక్టీరియాను ఉత్తేజపరచడంలోనూ వెల్లుల్లి సహాయపడుతుంది.
అల్లం
రక్తపోటు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ను నియంత్రించడంలో అల్లం సహాయపడతుంది. ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
కాబట్టి వ్యాక్సిన్ వేసుకునే ముందు ఆహారంలో అల్లం ఉండేలా జాగ్రత్త పడటం వల్ల ఒత్తిడి నుంచి దూరం కావచ్చు.
కాయగూరలు
రోజూ ఆహారంలో కాయగూరలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరల్లో పోషకాలు, ఖనిజాలు, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి.
ముఖ్యంగా పాలకూర, బ్రకోలి తినడం వల్ల మంట తగ్గుతుంది.
పండ్లు
పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
కాబట్టి వ్యాక్సినేషన్ ముందు, తర్వాత పండ్లు తినడం చాలా ముఖ్యం.
బ్లూబెర్రీస్
బ్లూ బెర్రీస్‌లో ఫైటో ఫ్లావనాయిడ్ నిండి ఉంటుంది. అలాగే వీటిలో విటమిన్ సీ, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి.
భావోద్వేగాలను నియంత్రించే సెరోటోనిన్ హార్మోన్ లెవల్స్‌ను పెంచడంలో బ్లూబెర్రీస్ సహాయపడతాయి. కాబట్టి వ్యాక్సినేషన్ సమయంలో వీటిని ఆహారంగా తీసుకోవడం మంచిది.
చికెన్ / వెజిటెబుల్ సూప్
ఈ కరోనా సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా అవసరం.
జీర్ణ వ్యవస్థలో ఉండే గట్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
గట్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండేందుకు మిక్స్‌డ్ వెజిటెబుల్ సూప్, చికెన్ సూప్ తాగొచ్చు.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో ఉండే సప్లిమెంట్లు తక్షణమే శక్తినిచ్చి, మూడ్‌ను మార్చేస్తాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా రక్తనాళాలకు సంబంధించి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వ్యాక్సినేషన్ తర్వాత డార్క్ చాక్లెట్ ఆహారంగా తీసుకోవచ్చు.
వర్జిన్ ఆలివ్ ఆయిల్
డయాబెటిస్, నాడీ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో వర్జిన్ ఆలివ్ ఆయిల్ దోహదపడుతుంది.
ఈ ఆలివ్ ఆయిల్‌లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి మంటకు కారణమయ్యే సీ ప్రోటీన్ తీవ్రతను తగ్గిస్తుంది.
కాబట్టి వ్యాక్సినేషన్ తర్వాత ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను ఆహారంలో వాడటం మంచిది.