– చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్పైశుభమ్ సోని ఆరోపణలు
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇదే నిజం, ఢిల్లీ: చత్తీస్‌గఢ్ ఎన్నికల వేళ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ ఓనర్ శుభమ్ సోని.. చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న యాప్ ఓనర్ శుభమ్ సోని మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. బెట్టింగ్ యాప్‌ను రూపొందించేందుకు సీఎం భూపేశ్ తనను ప్రోత్సాహించారని శుభమ్ ఆరోపించాడు. బెట్టింగ్ యాప్‌నకు అసలైన ఓనర్ ఆయనేనని వీడియోలో పేర్కొన్నాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టు అయినప్పుడు.. సీఎం తనని దుబాయ్‌కి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ఆరోపించాడు. ప్రస్తుతం ఈ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తనపై శుభమ్ సోని చేసిన ఆరోపణలను సీఎం తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.