– ఏడుగురి మృతి.. 21 మందికి అస్వస్థతక
-అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని గ్యారేజ్ లో కారు రిపేర్ చేస్తుండగా ప్రమాదం
-అక్కడే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో ప్రమాద తీవ్రత అధికం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : నాంపల్లి బజార్ ఘాట్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలో నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 7మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో 21 మంది అస్వస్థతకు గురికాగా, వారిలో 10 మంది అపస్మారస్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని గ్యారేజ్ లో కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని, అక్కడే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో మంటలంటుకున్నాయి. దీంతో చాలామంది పొగ వల్ల ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని డీసీపీ పేర్కొన్నారు.