Homeక్రైంCrime News: The investigation of the Nijjar murder case is being sidetracked...

Crime News: The investigation of the Nijjar murder case is being sidetracked Crime News :నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును పక్కదోవ పట్టిస్తున్నరు

–కెనడాలోని భారత రాయబారి వర్మ తీవ్ర ఆరోపణలు
–ఆధారాలను ఇప్పటివరకు సమర్పించలేదని వెల్లడి

ఇదే నిజం, నేషనల్ డెస్క్: ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసును ఉద్దేశపూర్వకంగానే ఓ కెనడా సీనియర్‌ అధికారి దెబ్బతీశాడని అక్కడి భారత హైకమిషనర్‌ సంజీవ్‌ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ అనే పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలను బలపర్చే ఆధారాలుంటే సమర్పించాలని వర్మ డిమాండ్‌ చేశారు. జూన్‌లో నిజ్జర్‌ హత్య తర్వాత కెనడా పోలీసులు చేపట్టిన దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆ దేశ అత్యున్నత స్థాయిలో అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో వారికి భారత్ సహకరించడానికి అవసరమైన ఆధారాలను మాత్రం ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. ‘ఆధారాలు ఎక్కడున్నాయి..? దర్యాప్తులో ఏమి తేలింది..? నేను ఒక అడుగు ముందుకేసి చెబుతున్నా.. కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారు. ఈ హత్యలో భారత్‌.. ఆ దేశ ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయి’ అని వర్మ వివరించారు.


భగవంతుడే మమ్మల్ని కాపాడాలి..

తనకు, సహచర దౌత్యవేత్తలకు కెనడాలో పొంచి ఉన్న ముప్పును కూడా వర్మ వివరించారు.‘నా భద్రత విషయంలో ఆందోళనగా ఉన్నా. మా కాన్సుల్‌ జనరల్స్‌ రక్షణ విషయం కూడా భయపెడుతోంది. మాకు ఏదైనా జరిగితే భగవంతుడే కాపాడాలి’అని వ్యాఖ్యానించారు. నిజ్జర్‌ హత్యకేసుకు సంబంధించి భారత దౌత్యవేత్తల సంభాషణలను కెనడా ఇంటెలిజెన్స్‌ సర్వీసు సేకరించిందని ఇటీవల పలు నివేదికలు బయటకు వచ్చాయి. ఈ నివేదికలను సంజీవ్‌ వర్మ తోసిపుచ్చారు. ‘‘ మీరు మాట్లాడుతోంది అక్రమంగా చేసిన వైర్‌ట్యాపింగ్‌ గురించా.. దౌత్యవేత్తల సంభాషణలకు అంతర్జాతీయ చట్టాల రక్షణ ఉంటుంది. ఆ సంభాషణలను ఎలా సేకరించారో చూపించమనండి.. స్వరాన్ని అనుకరించి మాట్లాడిన మాటలు కాదని నిరూపించండి’’ అని వర్మ డిమాండ్‌ చేశారు. ఏదైనా వివాదాన్ని నిర్దేశిత కమ్యూనికేషన్‌ మార్గంలో.. నిర్దేశిత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌ను విడదీయాలని కొందరు కెనడా వాసులు చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి సహకారం అందించొద్దని వర్మ సూచించారు.

Recent

- Advertisment -spot_img