Crop Loan : రుణమాఫీ కాక.. రైతు నెత్తిన వడ్డీ మోత
Crop Loan : పంట రుణమాఫీ నిధుల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.
రూ.లక్ష వరకు పంట రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించగా పూర్తిస్థాయి నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టతలేకుండా పోయింది.
మాఫీ కోసం ఎదురుచూస్తూ రైతులు రుణాల నవీకరణకు ముందుకు రాకపోవడంతో వారి ఖాతాలు ఎన్‌పీఏ(నిరర్ధక ఆస్తుల) జాబితాలోకి చేరుతున్న తీరుపై ప్రత్యేక కథనం
ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు తమ రుణాలను నవీకరణ చేయించుకోలేదు.
బ్యాంకర్లు పదేపదే చెప్పినా పెడచెవిన పెట్టారు. వడ్డీ ఎక్కువ పడుతుందని హెచ్చరించినా పట్టించుకోలేదు.
ఇప్పుడు వడ్డీ తడిసిమోపెడవుతోందని వాపోతున్నారు.
కనిష్ఠంగా రెండున్నరేళ్లు, గరిష్ఠంగా నాలుగేళ్ల నుంచి పంట రుణ బకాయిలున్నాయి.
ఆయా రైతుల ఖాతాలు ఎన్‌పీఏ(నిరర్ధక ఆస్తుల) జాబితాలోకి వెళ్లినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు.
బ్యాంకుల వారీగా అర్హుల గుర్తింపు
2018 డిసెంబరు 11 వరకు ఉన్న రుణాల్లో గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు సదరు రుణాలను నవీకరించకున్నా పాత తేదీ ఆధారంగానే అర్హులను గుర్తించి మాఫీ జాబితాలోకి తీసుకున్నారు.
ఈ తేదీ తరువాత తీసుకున్న వ్యవసాయ, బంగారంపై తీసుకున్న రుణాలను చేర్చలేదు.
విడతల వారీగా కాకుండా ఒకే దఫా చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
రెండు విడతలూ అసంపూర్తిగానే
పంట రుణాల్లో గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాఫీ చేసే ప్రక్రియలో భాగంగా రూ.25 వేలలోపు తీసుకున్న వారితో మొదలుపెట్టారు.
ఏడాదిన్నర గడుస్తున్నా ఈ ప్రయోజనం ఇప్పటికీ 41శాతం మందికి మాత్రమే అందింది.
ఎప్పటికి మాఫీ అవుతుందో స్పష్టత లేదు. రెండో విడతలో రూ.50 వేలలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.
రెండు విడతలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఇక రూ.లక్ష లోపు వారికి ఎప్పటికి అవుతుందోనని రైతులు కలవరపడుతున్నారు.