Homeహైదరాబాద్latest Newsరేవంత్ కు డేంజర్ బెల్స్.. సీటు గండం ఉన్నట్టేనా?

రేవంత్ కు డేంజర్ బెల్స్.. సీటు గండం ఉన్నట్టేనా?

  • ఎంపీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనపై.. హైకమాండ్​ ఫుల్​ సీరియస్​
  • ఓటమికి కారణాలపై త్రిసభ్య కమిటీ
  • 11 సీట్లు వస్తాయని భావించిన అధిష్ఠానం
  • కానీ గెలుచుకున్నది 8 సీట్లు మాత్రమే..
  • రేవంత్​ పై ఫిర్యాదుల పర్వం
  • చేజేతులా కొన్ని సీట్లు పోగొట్టుకున్నారని ఆగ్రహం
  • బలపడ్డ భట్టి, పొంగులేటి, ఉత్తమ్​, కోమటిరెడ్డి
  • సొంతజిల్లాలో ఎమ్మెల్సీ పోయి.. ఎంపీ పోయి రేవంత్​ బిక్కు బిక్కు
  • తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలు
  • ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ముందు వరకు ఓ లెక్క.. తర్వాత ఓ లెక్క అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మారిపోయింది. పీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ఇంతకాలం పార్టీలో తిరుగులేని ఆధిపత్యం సాధించిన రేవంత్​ రెడ్డికి తాజాగా మూడినట్టే కనిపిస్తోంది. పార్టీలో ఆయన పలుకుబడి తగ్గిపోయింది. అధిష్ఠానం వద్ద కూడా పెద్దగా మాట చెల్లుబాట అవుతున్నట్టు లేదు. వెరసి రేవంత్​ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా 12 స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్​ హైకమాండ్ భావించింది. రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా అటువంటి ధీమా కనిపించింది. కానీ గెలిచిందే కేవలం 8 సీట్లే.. పైగా రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు తెచ్చుకున్న బీజేపీ.. అదే స్థాయిలో పార్లమెంటులోనూ తెచ్చుకోగలిగిందంటే ఆ పార్టీ ఎంత గణనీయంగా పుంజుకున్నదో తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్​ హైకమాండ్ మనిషి వీహెచ్ అప్పుడే రేవంత్ మీద బహిరంగ విమర్శలు చేయడం గమనించ దగిన విషయం.

సీనియర్ల సత్తా
నిజానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి రావడానికి రేవంతే కారణమని ఆయన వర్గీయులు ఎప్పుడూ గట్టిగా చెబుతుంటారు. అసలు రేవంత్​ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు అన్నట్టుగా వారు మాట్లాడుతుంటారు. కానీ ఎంపీ ఎన్నికల్లో రేవంత్​ ప్రభావం పెద్దగా కనిపించలేదు. పైగా సీనియర్​ లీడర్లు, ఇతర మంత్రులు తమ పట్టు నిలబెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటికి చెంది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్​ పట్టు నిలుపుకున్నది. ఖమ్మం, మహబూబాబాద్ సునాయాసంగా గెలిచింది. ఇక నల్లగొండ మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్​ రెడ్డి దుమ్ములేపారు. భారీ మెజార్టీతో నల్లగొండ, భువనగిరి సెగ్మెంట్లలో సత్తా చాటారు. ఇక ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్​ హీరోలుగా నిలిచారు.

ఆ మూడింటితోనే మూడిందా?
మల్కాజిగిరి, చేవెళ్ల, పాలమూరు ఈ మూడు సెగ్మెంట్లను గెలిపించే బాధ్యత రేవంత్​ రెడ్డి మీద పడింది. కానీ ఈ మూడు సెగ్మెంట్లలోనూ ఆయన బొక్క బోర్లా పడ్డారు. చేవెళ్లలో రేవంత్​ ప్లాన్​ బెడిసికొట్టింది. ఇక్కడ బలమైన లీడర్ పట్నం మహేందర్ రెడ్డి భార్య.. సునీతా రెడ్డికి టికెట్​ ఇవ్వకుండా.. ఆమెను మల్కాజిగిరికి పంపారు. ఇక చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న రంజిత్ రెడ్డికి టికెట్​ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ఇటు మల్కాజిగిరి, అటు చేవెళ్ల రెండు స్థానాల్లో వీక్​ అయ్యింది. దీంతో ఈ రెండు సీట్లను కాంగ్రెస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో రేవంత్​ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. కొండాను అనేక సందర్భాల్లో రేవంత్​ పొగిడారు కూడా.. ఇక ఈటల విషయంలోనూ రేవంత్​ రెడ్డిదే సాఫ్ట్ కార్నరే.. వీళ్లిద్దరూ తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న దాఖలాలు లేవు. దీంతో కొండా, ఈటలను గెలిపించేందుకే రేవంత్ ఇటువంటి డ్రామా ఆడారా? అన్న డౌట్స్​ కూడా వస్తున్నాయి. ఇక మహబూబ్ నగర్​ స్థానంలో కాంగ్రెస్​ ఓడిపోవడంతో రేవంత్​ పరువు పూర్తిగా పోయింది. ఆయన ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ.. పాలమూరు రేవంత్​ రెడ్డికి సొంత నియోజకవర్గం ఆ సీటును ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 10 నుంచి 12 సభలు నిర్వహించారు. అంతర్గత సమావేశాలకు లెక్కే లేదు. చేరికలు, ప్రలోభాలతో ఫుల్ హైప్ క్రియేట్​ చేశారు. ఇంత చేసినా ఇక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణను తట్టుకోలేకపోయారు. మరోవైపు సొంత జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో రేవంత్​ పరిస్థితి మరింత డౌన్ అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

హైకమాండ్​ ఫుల్ సీరియస్​
ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది. ఆ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయని భావించిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. కానీ ఇక్కడ కేవలం 8 సీట్లు మాత్రమే తెచ్చుకున్నది. దీంతో హైకమాండ్​ తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. గతంలో రేవంత్ రెడ్డిని సమర్థుడిగా భావించి.. ఎన్ని ఒత్తిడులు ఉన్నా అతడినే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేసింది. కాగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో సీనియర్​ మంత్రులు సత్తా చాటారు కానీ రేవంత్​ ఉసూరుమన్నారు. దీంతో రేవంత్ మీదే కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉందట. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్​ ఓటమిపై అధ్యయనం చేసేందుకు పార్టీ త్రిసభ్య కమిటీ ని వేసింది. పీజే కురియన్ (కేరళ), రకీముల్ హసన్ (అస్సాం) , పర్గత్ సింగ్ (పంజాబ్​) ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ లీడర్లను, ద్వితీయశ్రేణి నేతలను, వివిధ వర్గాల ప్రజలను కలుసుకొని అధ్యయనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తక్కువ సీట్లు సాధించింది? తదితర అంశాల ఆధారంగా ఓ నివేదికను ఇవ్వనున్నది. అయితే ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నదా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతున్నదా? అన్న చర్చ కూడా సాగుతోంది.

Recent

- Advertisment -spot_img