- 21న అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగేనా?
- కోర్టు తీర్పు పైనే నిర్ణయం
ఇదేనిజం ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం పై నిర్వహించే సమావేశం కొనసాగుతుందా? లేదా? అనేది బుధవారం తేలనుంది. ఈ నెల 5న డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేసిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లు నోటీసులు అందజేసి క్యాంపునకు తరలివెళ్లారు. మొదట డీసీసీబీ చైర్మన్ పదవిని వదులుకునేందుకు సిద్దమైన పోచారం భాస్కర్ రెడ్డి తరువాత తన పదవిని కాపాడుకునేందుకు కోర్టు గడుపను తొక్కారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిన వెంటనే డీసీసీబీ డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు. ఈ మేరకు ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డిపై ఆవిశ్వాసానికి నోటీసులు ఇవ్వగా జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత శాఖ కమిషనర్ నోటీసులు ఇవ్వాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జిల్లా కో ఆపరేటివ్ అధికారి (డీసీపీ) శ్రీనివాస్ నోటీసులు ఇచ్చారు. దీనిపైనే అధికారులు చర్యలు చేపట్టారు. డీసీసీబీలో సాధారణ అధికారిక సభ్యుడు అయిన డీసీఓకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని కోర్టులో డీసీసీబీ చైర్మన్ సవాల్ చేశారు. దీనిపై కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందోనని, తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలనే ఆంశంపై అధికారులు వేచి చూస్తున్నారు.