– నిజామాబాద్ జిల్లాలో దారుణం
ఇదేనిజం ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ పరీక్షల కోసం బాగా ప్రిపేర్ కావాలని హితువు పలికినందుకు డిగ్రీ విద్యార్థిని ఇంటర్ విద్యార్థులు దారుణంగా హతమార్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. బోధన్ లోని బిసి హాస్టల్ లో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన వెంకట్ (20) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. అయితే ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నందున తన జూనియర్స్ అయిన ఇంటర్ విద్యార్థులకు బాగా చదవాలని సూచించాడు. దీంతో విద్యార్థుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. ఇంటర్ విద్యార్థులు ఆరుగురు కలిసి డిగ్రీ విద్యార్థి వెంకట్ పై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హాస్టల్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా సంఘటన జరిగిందని, సమగ్ర విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.