Delhi CM : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి సరిగ్గా 10 రోజులు కావస్తున్నా, ఇంకా సీఎం అభ్యర్థిని నిర్ణయించలేదు. రేపు ఢిల్లీ బిజెపి శాసనసభా పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా, మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే సమావేశంలో 48 మంది బిజెపి ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఢిల్లీ సీఎం (Delhi CM) ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీ ఇప్పటికే నిర్ణయించబడింది. ఢిల్లీ కొత్త సీఎం ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ సీఎం ఎవరు అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే ఉంది. ఢిల్లీ సీఎం రేసులో మూడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో ఉండగా, ఎమ్మెల్యే రేఖ గుప్తా, మనోజ్ తివారీలు రేసులో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఢిల్లీ సీఎం ఎవరు అనేది బీజేపీ హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.