Delhi Cm : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలు గెలుచుకున్న బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి (Delhi Cm) ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ మరియు అమెరికా దేశాలను సందర్శించనున్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తారు అని తెలుస్తుంది. ఢిల్లీలో 48 సీట్లు గెలుచుకున్న బిజెపి ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియలో ఉంది. నాయకులతో చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆదివారం హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపారు. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కేంద్రంలోని నాయకులే నిర్ణయం తీసుకుంటారని బిజెపి ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ అన్నారు. అయితే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ నేత పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. అలాగే సతీష్ ఉపాధ్యాయ్, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి అనుభవజ్ఞులైన నాయకులు కూడా ఢిల్లీ సీఎం పదవిని ఆశిస్తున్నారు.