ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ రోజు మధ్యాహ్నం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ గత గురువారం (మార్చి 21) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. మరుసటి రోజు కోర్టులో హాజరు పరచగా.. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా అతనిని మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించారు. కేజ్రీవాల్‌ను 10 రోజుల పాటు కస్టడీలో విచారించాలని ఏజెన్సీ ఒత్తిడి చేయడంతో కోర్టు కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది.
మరోవైపు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరవచ్చని తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసును సీబీఐ కూడా విచారిస్తోంది. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ బుధవారం కేజ్రీవాల్ ను కలిశారు. ఆ తర్వాత.. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో ఆయన కోర్టులో చెబుతారని మీడియాకు తెలిపారామె. ఈడీ ఇప్పటి వరకూ 250 ప్రాంతాల్లో సోదాలు చేసినా ఒక్కరూపాయి కూడా దొరకలేదని, సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ ఇళ్లలోనూ ఒక్క రూపాయి దొరకలేదన్నారు. కేజ్రీవాల్ భౌతికంగా జైల్లో ఉన్నా.. ఆయన మనసంతా ప్రజల దగ్గరే ఉందన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హరక్ సింగ్ రావత్‌కు మరోసారి PMLA కింద సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 2న అతన్ని విచారణకు పిలిచింది. అటవీ శాఖను అక్రమంగా ఆక్రమించిన కేసులో హరక్ సింగ్ రావత్‌కు ED సమన్లు జారీ చేసింది. గతంలోనూ ఆయన సమన్లు జారీ చేయగా.. ఈడీ విచారణకు హాజరుకాలేదు.