– తాజాగా సీబీఐ మళ్లీ అరెస్ట్
– మార్చి 15న ఇదే కేసులో అరెస్ట్ చేసిన ఈడీ
– వేర్వేరుగా విచారించనున్న రెండు దర్యాప్తు సంస్థలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో కవితను తాజాగా సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఇదే కేసులో ఆమెను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. కాగా గురువారం కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా కవిత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఈ నెల 16న విచారణ జరగనున్నది. తీహార్ జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఇటు సీబీఐ, ఈడీ వేర్వేరుగా విచారించనున్నాయి. అక్రమ నగదు లావాదేవీలపై ఈడీ ఆమెను ప్రశ్నించనున్నది. ఇక నేరం ఎలా జరిగింది? ఈ నేరానికి ఎక్కడ బీజం పడింది.. తదితర అంశాలపై సీబీఐ ఎంక్వైరీ కొనసాగించనున్నది.