– హైకమాండ్ నుంచి హామీ?
– కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ
– ఇదే పోస్ట్ కోసం మరో ఇద్దరు నేతల పోటీ
– పవర్ లోకి రాకముందే పదవుల పంపకాలు?
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వివేక్ వెంకటస్వామికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆయనకు ఏఐసీసీ నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపైనే చెన్నూరు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పలుమార్లు ప్రకటించుకున్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాన్ని పెద్దగా ఖండించలేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రేవంతే అనధికారిక సీఎం అభ్యర్థి అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం విషయంలోనూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వస్తే.. డిప్యూటీ సీఎం దళితుడికి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ పోస్టు కోసం మల్లు భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ పోటీ పడుతున్నారు. నిజానికి మల్లు భట్టి విక్రమార్క సీఎం రేసులోనూ ఉన్నారు. ఒకవేళ దళితుడికే సీఎం ఇవ్వాలని భావిస్తే తనకే ఈ పోస్ట్ వస్తుందని ఆయన అనుకుంటున్నారు. అయితే సీఎం పదవి రేవంత్ కు దక్కితే తనకు డిప్యూటీ సీఎం వస్తుందని భావిస్తున్నారు. ఇక గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉండటంతో దామోదర రాజనర్సింహ సైతం ఈ పదవి మీద ఆశగా ఉన్నారు. అయితే అధిష్ఠానం ఆలోచన మరోలా ఉందని సమాచారం. వివేక్ వెంకటస్వామికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన చెరబోయే ముందే స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం. కాకా కుమారుడు కావడంతో ఆయనవైపు అధిష్ఠానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దీనికి తోడు వివేక్ పారిశ్రామక వేత్త కావడం.. మీడియా అధినేత కావడంతో ఆయనకు డిప్యూటీ సీఎం అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో? లేదా ఇంకా తెలియదు.. కానీ ఆ లోపే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులపై చర్చ జరగడం గమనార్హం.