Homeజాతీయంకసబ్‌ను ఉరికంబం ఎక్కించిన ‘దేవిక’ గుర్తుందా?

కసబ్‌ను ఉరికంబం ఎక్కించిన ‘దేవిక’ గుర్తుందా?

ముంబాయి: కసబ్​ని ఉరికంబం ఎక్కించిన అమ్మాయి దేవిక గుర్తుందా.. 11 ఏండ్లు అవుతుందిగా మర్చిపోయి ఉంటారు. కానీ చేతి కర్రల సాయంతో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ.. పతాక శీర్షికల్లో నిలించింది. అవసరమైన సాయం చేస్తామంది ప్రభుత్వం.. సెలబ్రిటీలతో ఫోటోలు ఇక ఏముంది జీవితం మారిపోయి ఉంటుందులే అనుకుంటున్నారా.. అయితే మీరు నిజం తెలసుకోవాల్సిందే.
సజీవ సాక్ష్యంగా..
అది 2008, నవంబర్‌ 26న ముంబాయిలో ఉగ్రవాదుల సృష్టించిన మారణహోమం దృశ్యాలు నెట్లో వెతికితే దొరుకుతాయి. ఆ దుశ్చర్యలో దాదాపు 58 మంది అసువులు బాసారు. ఆ ఉగ్రవాద ముఠాలో సజీవంగా భద్రత దళాలకు చిక్కింది కసబ్​ ఒక్కటే. ఛత్రపతి శివాజీ టెర్మినల్​లో వాడు సృష్టించిన మారణహోమానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది తొమ్మిదేళ్ల దేవిక మాత్రమే. కాలికి బులెట్‌ దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయిన ఆ చిన్నారి కళ్లు తెరిచే సరికి ఆస్పత్రిలో ఉంది. 2009 జూన్​లో కసబ్​ని కోర్టుకి వచ్చి గుర్తించి అతడికి ఉరిశిక్ష పడేలా చేసింది. కొన్నాళ్లపాటు టీవీల ఇంటర్వ్యూలు, సెలబ్రిటీలతో ఫోటోలు ఇలా సాగింది. కొన్నాళ్లకు అందరూ మర్చిపోయారు. ప్రభుత్వం కూడా వీళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు.
అదే పేదరికం.. చిన్న గది
11 ఏండ్ల కింద వారి కుటుంబం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. పశ్చిమ బాంద్రాలోని మురికివాడలో నివాసం. అదే పేదరికం. అదే చిన్న గది. దేవిక ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. తండ్రి నట్వర్‌లాల్‌ కూలీపనికి పోతున్నాడు. తల్లి మరణించింది. పెద్దన్నయ్య భరత్​ పూణెలో చిన్న చితకా పనులు చేస్తుంటాడు. చిన్నన్నయ్య జయేష్​ తండ్రితోపాటు కూలీ పనులకు పోతాడు. కసబ్​ని ఉరికంబం ఎక్కించిన తర్వాత హడావుడీ చేసిన రాజకీయ నేతలు, మీడియా ఎవరూ వారి జీవితాలను మార్చలేకపోయారు. కసబ్​ని గుర్తించిన తర్వాత ఎవరూ తనని స్కూల్​లో అడ్మిషన్​ ఇచ్చేందుకు కూడా ముందుకురాలేదు. బంధువులు సైతం వీరి కుటుంబాన్ని దూరంగా పెట్టారు. కారణం భయం. ఉగ్రవాదులు ఎవరైనా ఎమైనా చేస్తారేమోనని భయం. ఇప్పటికీ కొన్ని గుర్తు తెలియని నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తుంటాయని దేవిక చెప్పారు.
ఎమ్మెల్యే రాకతో..
ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీషన్‌బాబా సిద్ధిక్‌ తన ఇంటికి వెళ్లడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మనసున్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే వారి బాధను చూసి తనకు చేతనైనంత ఆర్ధిక సాయం చేశాడు. దేవిక కుటుంబానికి ఓ ఇల్లు, దేవిక కుటుంబానికి ఆర్థిక భద్రతతోపాటు బెదిరింపు కాల్స్​పై దర్యాప్తు చేయించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేను అభ్యర్థిస్తూ ఓ లెటర్​ కూడా రాసాడు. ఉద్ధవ్​ ప్రభుత్వం దేవిక కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుందాం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img