భూముల అమ్మకాలు, గిఫ్ట్, సక్సెషన్, పార్టిషన్ ఆప్షన్లతో మొదలైన ధరణి పోర్టల్.. పెండింగ్ మ్యుటేషన్, నాలా కన్వర్షన్ వంటి 18 ఆప్షన్లతో ప్రజలకు మరింత చేరువైంది.
ధరణి పోర్టల్ దిగ్విజయంగా వంద రోజులు పూర్తిచేసుకున్నది. వేగంగా, పారదర్శక సేవలతో అందరి మన్ననలు అందుకుంటున్నది.
గతేడాది అక్టోబర్ 29న మూడుచింతలపల్లి మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
‘ఒక గొప్ప పనిని లేదా విప్లవాత్మక మార్పును మొదలుపెట్టినప్పుడు ప్రా రంభంలో కొన్ని సమస్యలు వస్తాయి. వీటిని టీతింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే దాని ఫలాలు అందుతాయి’ ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాట ఇది.
ధరణిలో కనిష్ఠంగా మూడు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నది. సగటున పావుగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయి పట్టా చేతికి వస్తున్నది. వేర్వేరు ఆఫీస్‌ల చుట్టూ తిరుగాల్సిన అవసరం తప్పింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా సులభంగా మారింది. క్రయ, విక్రయదారులు సొంతంగా లేదా మీసేవకు వెళ్లి సిటిజన్ లాగిన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. పూర్తి వివరాలను నమోదుచేయంతోపాటు పత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో సుమారు 60 శాతం పని పూర్తవుతున్నది.
నిర్దేశిత సమయంలో ఆఫీస్‌కు వెళ్లి పావుగంటలోనే పట్టాతో బయటికి వస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే ఆలస్యం అవుతున్నది.
నాలా కన్వర్షన్లు సైతం కనిష్ఠంగా 2 నిమిషాల్లో.. సగటున 8 నిమిషాల్లో పూర్తవుతున్నాయి. లంచాల ఊసేలేదు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాటికి పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్లు లక్షన్నరకు చేరువయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో ఇప్పటివరకు 1,45,467 స్లాట్ బుకింగ్‌లు అయ్యాయి. పోర్టల్ ద్వారా 1,39,629 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ధరణి ద్వారా చేసుకున్న నాలా దరఖాస్తులు 4,933 నమోదు కాగా అందులో 4,523 దరఖాస్తులను అనుమతి ఇచ్చారు.