దక్షిణ భారతదేశంలో వరి అన్నం లేకుండా భోజనం ఊహించడం కష్టమే. అల్పాహారం నుంచి పిండివంటల వరకు చాలా వంటలలో బియ్యంతో చేసిన పదార్ధాలు కనిపిస్తాయి.
పిల్లలకు అన్నప్రాసన చేసేటప్పుడు బియ్యంతో వండిన పదార్థాలనే చాలా ప్రాంతాలలో తినిపిస్తారు.
ఇక పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో సైతం బియ్యంతో చేసిన రక రకాల పదార్థాలు వడ్డిస్తారు.
ఆలయాలలో దేముడికి సమర్పించే నైవేద్యాలలో, పంచే ప్రసాదాలలో కూడా పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటి బియ్యంతో చేసే పదార్ధాలే ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికిపైగా ప్రజలకు వరి అన్నం ప్రధాన ఆహారం.
ఇంత ప్రాముఖ్యమున్న వరి అన్నం తినడం వలన చక్కెర వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని 21 దేశాలలో పరిశోధకులు 10 ఏళ్ల పాటు 1,30,000 మందిపై చేసిన అధ్యయనంలో తేల్చారు.
ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాలలో నివసించే ప్రజలకు మరింత ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన తెలిపింది.
పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హామిల్టన్ హెల్త్ సైన్సెస్, కెనడాకి చెందిన మెక్ మాస్టర్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పరిశోధకులు పాల్గొన్నారు.
ప్రజల ఆహారంలో ప్రధానమైన అన్నం చక్కెర వ్యాధికి దారి తీస్తుందని పరిశోధనలు చెబుతుంటే అన్నం తినాలో వద్దో అనే అనుమానాలు తలెత్తుతాయి.
మరి దీనిపై వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
తెల్లని అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తినవచ్చు
ప్రకృతిలో సహజంగా లభించే ఏ ఆహార పదార్ధమైనా ఆరోగ్యానికి మంచిదేననీ, కానీ, దానిని ప్రకృతి నుంచి వేరు చేసి తినే ప్రక్రియలో వాటి సహజత్వాన్ని నాశనం చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయని రాజమండ్రికి చెందిన డయాబెటాలజిస్ట్ కరుటూరి సుబ్రహ్మణ్యం అన్నారు.
పొట్టు తీయని బియ్యం ఆరోగ్యానికి హానికరం కాదని ఆయన అన్నారు.
“బ్రౌన్ రైస్ స్వల్ప మోతాదులో తినేసరికే ఆకలి తీరిపోవడం వలన ఎక్కువ తినలేరు.
అదే, పాలిష్ చేసిన బియ్యం అయితే ఎక్కువ తినగలుగుతారు. అలా ఎక్కువ తినడం వల్ల శరీరంలోకి వెళ్లే కార్బోహైడ్రేట్ల శాతం కూడా పెరిగిపోతుంది.
అలా అని మార్కెట్లో లభించే సెమీ బ్రౌన్ రైస్ వల్ల కూడా ఎలాంటి మేలు జరగదు” అన్నారాయన.
మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు తిన్నటువంటి ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలే జరుగుతుంది కానీ, వారు చేసినంత పని మనం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని పరిశీలించి చూసుకోవాల్సి ఉందని చెప్పారు.
“పీచుతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరంలోకి చేరే గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది” అని ఆయన చెప్పారు.
“అన్నం మాత్రమే శత్రువు కాదని, అన్నం మానేసి నాలుగు సార్లు నాలుగు స్పూన్ల చక్కెరతో టీ తాగినా, మరో రకమైన చక్కెరతో కూడుకున్న పదార్ధాలు తీసుకున్నాఅది మరింత ప్రమాదం అని” ఆయన అన్నారు.