– తెలంగాణలో పోటీకి టీడీపీ విముఖత!
– నొచ్చుకున్న టీటీడీపీ అధ్యక్షుడు
– గులాబీ పార్టీ ఆహ్వానం?
– ముదిరాజ్ల ఓట్లు కలిసొస్తాయని అంచనా
– భవిష్యత్లో కాసానికి కీలక పదవి?
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లోకి రాబోతున్నట్టు సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్టు టాక్. ఇక్కడ పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో కాసాని గులాబీ గూటికి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాసానికి ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సామాజికిర్గానికి చెందిన నేత. దీంతో బీసీ కార్డు కలిసి వస్తుందని ఆయనను చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా కేటాయించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజికవర్గమే. ఈటల ప్రస్తుతం ముదిరాజ్ సమాజికవర్గాన్ని ఏకం చేసి.. ఆ వర్గం ఓటర్లను తన వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్కు మంచి చాన్స్?
ప్రస్తుతం బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ తమ పార్టీలో చేరడాన్ని మంచి అవశాకంగా భావిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ముదిరాజ్ లను తమవైపుకు తిప్పుకొచ్చని లెక్కలు వేసుకుంటున్నది. ఇక కాసానికి సైతం మంచి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి.. కాసానికి ఎమ్మెల్సీ పోస్ట్ లేదంటే ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ లీడర్లు బీఆర్ఎస్ గూటికి చేరుకొని కీలక పదవులు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తలసాని శ్రీనివాసయాదవ్, పట్నం మహేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ వంటి నేతలంతా టీడీపీ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. తాజాగా కాసాని చేరికతో తమకు మరింత బలం చేకూరుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది.