అధిక బరువు ఓ సమస్య మాత్రమే కాదు, అనేకానేక అనారోగ్యాలకు సింహద్వారం.
శరీరంలో కొవ్వు పేరుకు పోవడం వల్ల ఇన్సులిన్ సరఫరా దెబ్బతిని మధుమేహానికి దారి తీస్తుంది.
రక్తపోటు, దాన్నుంచి గుండె జబ్బులు పలుకరిస్తాయి. అందుకే, ‘వ్యాయామం చేయండి.
బరువు తగ్గించుకోండి’ అనే సూచన తరచుగా వినిపిస్తుంది. కానీ, చాలా సందర్భాలలో ‘మేం ఆహారం తగ్గించేశాం, వాకింగ్ మొదలుపెట్టాం.
అయినా, బరువు తగ్గడం లేదు’ అనే ఫిర్యాదు వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు ఓ కారణాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
కొందరి శరీరంలోని GKN1 అనే ప్రొటీన్‌వల్ల, వాళ్లు ఎంత తక్కువ తిన్నా బరువు పెరిగిపోతూనే ఉంటారని తేల్చారు.
ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలలో GKN1 ప్రొటీన్‌ను తగ్గించినప్పుడు అవి ఎక్కువ తిన్నాకూడా లావు కాకపోవడాన్ని గమనించారు.
అయితే, ఈ GKN1 ప్రొటీన్‌ను బలవంతంగా నియంత్రించడం వల్ల కాలేయం దెబ్బ తినే ప్రమాదం కనిపించింది.
మరిన్ని పరిశోధనల తర్వాత, ఈ ఫలితాలను మనుషులమీద సురక్షితంగా ప్రయోగించే అవకాశం ఉందని అంటున్నారు