పార్లమెంట్‌లో వెల్లడించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో భారత్-చైనా సరిహద్దు సమస్యపై రక్షణ మంత్రి ప్రకటన చేశారు. చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన ప్రభుత్వం ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. వాస్తవాధీన రేఖను గుర్తించడంలో చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు.
శాంతినే కోరుకుంటున్నాం..
చైనాతో శాంతినే కోరుకుంటున్నామని, ఇదే విషయాన్ని చైనా రక్షణ మంత్రితో చెప్పానని మంత్రి అన్నారు. ఎల్‌ఏసీ దగ్గర యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టంగా చెప్పానని రాజ్‌నాథ్ పార్లమెంట్‌కు వివరించారు. చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇస్తున్నా సరిహద్దులను గుర్తించే విషయంలో మొండిగా వాదిస్తోందని దుయ్యబట్టారు.
90 వేల కిలోమీటర్ల ఆక్రమణ
చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్‌లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని రక్షణ మంత్రి తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎల్‌ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని, చైనా ఏకపక్ష చర్యలను నిశితంగా గమనిస్తున్నామని, సరిహద్దుల్లో మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్ చెప్పారు.
ఇంకా ఉద్రిక్తంగానే చైనా సరిహద్దు
RELATED ARTICLES