– బీఎస్పీ x డీఎస్పీ
– పల్లెపల్లెకు తిరిగిన విశారదన్ మహారాజ్
– ఐపీఎస్ వదులుకొని రాజకీయాల్లోకి ఆర్ఎస్పీ
– ఎవరికి దారిలో వారి పోరాటం
– కలుపుకొని వెళ్లేందుకు విశారదన్ ఆసక్తి
– పట్టించుకోని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
– బహుజనవాదుల్లో తీవ్ర సంశయాలు
– ఎజెండా ఒక్కటే అయినా వేర్వేరే దారుల్లో పయనం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఆ ఇద్దరూ బహుజనవాదం వినిపించే నేతలే. బడుగు, బలహీనవర్గాల రాజ్యాధికారం కోసం పోరాడే నాయకులే. కానీ ఎవరి దారి వారిదే.. ఎవరి లెక్క వారిదే.. ఎజెండా ఒక్కటేనైనా ఒకరంటే ఒకరికి పడదు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటారు. వాళ్లే ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్.. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ పల్లెల్లోని దళిత వాడల్లో స్ఫూర్తిని నింపిన లీడర్ విశారదన్ పది వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. 500 రోజులు తిరిగి.. దాదాపు 30 వేల గ్రామాలను చుట్టేశారు. మాదిగలు అంటే మహారాజులన్నది ఆయన నమ్మకం.. మాదిగలు అంటే మహాఆదిగలు అని ఆయన చెబుతుంటారు. మాదిగలు గతంలో పాలకులని ఆయన నమ్ముతారు. అందుకు సంబంధించిన పురాణాలు, చరిత్రకు సంబంధించిన ఆధారాలను ఉంటంకిస్తుంటారాయన.
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెపల్లెనా మాదిగ వాడలకు ‘మహారాజుల కాలనీ’గా ఆయన నామకరణం చేశారు. విశారదన్ మహారాజ్ గొప్ప వక్త.. ఆయన అనర్గళంగా మాట్లాడుతూ అందరినీ కట్టి పడేస్తుంటారు. దళితులను అణిచివేతను ప్రశ్నిస్తుంటారు. అందుకే దళితుల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఐపీఎస్ కు స్వచ్చంద విరమణ చేసి బీఎస్పీలో చేరారు. ఆయన స్వేరోస్ అనే ఓ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు లీడర్లదీ ఒకటే అజెండా అయినప్పటికీ వీరి మధ్య ఆధిపత్యం పోరు సాగుతోంది. ఆర్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పనిచేసేందుకు విశారదన్ మహారాజ్ సిద్ధంగా ఉన్నట్టు పలు సార్లు ప్రకటించారు. కానీ ఆర్ ప్రవీణ్ కుమార్ మాత్రం అందుకు అంగీకరించడం లేదన్న విమర్శ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దళిత వాదానికి తానే చాంపియన్ గా ఉండాలని భావించే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విశారదన్ తో కలిసి పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. దీంతో ప్రస్తుతం బహుజనవాదుల్లో కన్ఫ్యూజన్ విశారదన్ వెంటన నడవాలా? లేక ఆర్ ఎస్పీకి సపోర్ట్ చేయాలా? అన్న విషయంపై కన్ఫ్యూజన్ నెలకొన్నది.
విశారదన్ అలుపెరగని పోరాటం :
విశారదన్ కాన్షీరామ్ ఆలోచనా విధానాలను పుణికి పుచ్చుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీఎస్పీలో కొంతకాలం పనిచేసిన విశారదన్.. దళితుల కోసం సరికొత్త పంథాలో పనిచేయాలన్న ఉద్దేశ్యంతో దళితశక్తి ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టి మహాపాదయాత్ర పేరుతో దాదాపు 12 ఏండ్ల పాటూ పల్లెపల్లెకు తిరిగి దళితుల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. దాదాపు 3,000 గ్రామాల్లో పర్యటించారు. ఈ పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సభలోనే ఆయన పార్టీని స్థాపించారు.
ఇద్దరి మధ్య విబేధాలు ఎందుకు?
విశారదన్ చాలా సందర్భాల్లో తాను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చారు. కానీ ఆర్ ప్రవీణ్ కుమార్ విశారదన్ విషయంలో చాలా అవమానకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు తనకు విశారదన్ ఎవరో తెలియదంటూ ఆయన చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విశారదన్ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. విశారదన్ వివాద రహితంగా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రవీణ్ కుమార్కు చెందిన స్వేరోస్ సంస్థ మీద విశారదన్ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంస్థ తన మీద, తన కుటుంబసభ్యుల మీద వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తోందని విశారదన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ధర్మస్వరాజ్ పార్టీ ని ఒక పార్టీగా గుర్తించేందుకు సైతం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్టపడటం లేదు. మరోవైపు అదో కుల సంస్థ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో విశారదన్ అభిమానులు నొచ్చుకున్నారు. వెరసి వీరి మధ్య దూరం పెరిగింది. గత మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిని బరిలో దించింది. ఆ పార్టీకి 4046 ఓట్లు వచ్చాయి. ఇక విశారదన్ ఓ స్వతంత్ర అభ్యర్థిగా సపోర్ట్ చేశారు. దీంతో తనకు పడే ఓట్లు చీల్చేందుకే విశారదన్ స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇచ్చాడని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన మీద కోపం గా ఉన్నట్టు సమాచారం.
అన్ని స్థానాల్లో పోటీ :
ఇక వచ్చే ఎన్నికల్లో ఇటు ధర్మస్వరాజ్ పార్టీ, బీఎస్పీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నాయి. దీంతో బహుజన ఓటర్లు ఎవరిపక్షం వహించబోతున్నారన్నది చర్చనీయాంశం అయ్యింది. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ధర్మస్వరాజ్ పార్టీని అస్సలు సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దళితులకు సంబంధించినంత వరకు తానే ప్రతినిధిగా ఉండాలన్న భావనలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక విశారదన్ మహారాజ్ మాత్రం అనర్గళంగా ప్రసంగిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ లకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో బహుజనులను సంఘటితం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ధర్మస్వరాజ్ పార్టీ సైతం 53 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. మొత్తం 119 స్థానాల్లో ఇరు పార్టీలు పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగబోతున్నారు. అక్కడ కూడా ధర్మ స్వరాజ్ పార్టీ పోటీలో ఉండనున్నది. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో ఎటువైపు ఉండాలో తెలియక సామాన్య బహుజనులు సందిగ్ధంలో పడిపోయారు.