బతుకమ్మ చీరల పంపిణీ షురూ అయ్యింది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వంలా కాకుండా.. తెలంగాణ ఆడపడుచుల చీరల పంపిణీ పేరుతో నూతన పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాతోపాటు గిరిజన జిల్లాలైన మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతోపాటు 18 ఏండ్లు నిండిన గిరిజన మహిళలకు చీరలను పంపిణీ చేసేందుకు ఆయా జిల్లాలకు సరఫరా చేశారు. నేటి నుంచి తెలంగాణ ఆడపడుచుల చీరలను మహిళా సంఘాల ద్వారా ఎంపిక చేసిన సభ్యులకు అందించనున్నారు.