– ముఖ్యమంత్రి కావాలనే తొందర నాకు లేదు
– కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
– మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ రిప్లయ్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తమ 19 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తామని మాజీ సీఎం, జేడీఎస్ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా వీటిపై డీకే శివకుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి కావాలనే తొందర తనకేమీ లేదని స్పష్టం చేశారు. ‘సమష్టి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నాం. మేము సుపరిపాలన అందించాల్సి ఉంది. నాకు ముఖ్యమంత్రి పదవి చేపట్టడంపై తొందరేం లేదు. దీనిపై నేను.. ఎవరినీ, అధిష్ఠానాన్ని కూడా డిమాండ్ చేయలేదు. అధిష్ఠానం ఏం చెబితే అదే పాటిస్తాం. సిద్ధరామయ్యే మా నేత. ఆయన కూడా ఈ విషయాన్నే చెప్పారు. ఇదే మా నిబద్ధత’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను సిద్ధరామయ్య కూడా పాటిస్తారని డీకేఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి జరగనుందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. కొన్ని రోజుల తర్వాత డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో అధిష్ఠానం ఆదేశిస్తే తాను సీఎం పదవి చేట్టేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక ఐటీశాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. ఇలా సీఎం పీఠంపై పలువురు కాంగ్రెస్ నాయకులు స్పందిస్తోన్న క్రమంలో జేడీఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతమంది ఆకాంక్షిస్తున్నారో తెలియదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తాము మద్దతు ఇస్తామని వ్యాఖ్యానించారు. శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే తెరవెనుక నుంచి సీఎం సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారని ఆరోపించారు. అయితే.. వీటిని తోసిపుచ్చుతూ డీకే శివకుమార్ ఇలా స్పందించారు.