– నటుడు శివ రాజ్‌కుమార్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే ఆఫర్
– సున్నితంగా తిరస్కరించిన శివ రాజ్ కుమార్?
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో లోక్ సభలోనే అదే ఊపు కొనసాగించాలని ఆ పార్టీ చూస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌కు పబ్లిక్‌గా ఓ ఆఫర్ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ స్టార్ హీరోను కోరారు. అందుకే ఆ ప్రతిపాదనను శివ రాజ్ కుమార్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని శివ రాజ్‌కుమార్‌ను కోరా. కానీ, ఆయన చాలా సినిమా షూటింగ్‌లు పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఆయనకు నేను చెప్పేది ఒకటే.. సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ, పార్లమెంట్‌కు వెళ్లే గొప్ప అవకాశం అందరికీ రాదు. మీ తలుపుతట్టిన అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. మా ఆఫర్‌ను ఒకసారి పరిశీలించండి’ అని నటుడిని కోరారు. అందుకు శివ రాజ్ కుమార్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే తన భార్య పేరును పరిశీలించాలని ఆయన కోరినట్టు టాక్. ‘ముఖానికి రంగులద్దుకుని నటించి ప్రేక్షకులను మెప్పించడం అనేది నా తండ్రి నాకిచ్చిన బహుమతి. ప్రత్యక్ష రాజకీయాలకు మా కుటుంబం దూరంగా ఉంటుంది. రాజకీయాలతో నాకున్న ఏకైక సంబంధం.. నేను గీత (మాజీ సీఎం బంగారప్ప కుమార్తె)ను వివాహం చేసుకోవడమే. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఓ భర్తగా ఆమె ఆశయాలను నేను ప్రోత్సహిస్తాను. ఆమెకు మీరు టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చు ’ అని శివరాజ్‌కుమార్ డిప్యూటీ సీఎంకు చెప్పినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.