బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులను అవమానించినట్లుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని యాజమాన్యం వ్యతిరేకించినా.. తెలంగాణ కోసం జర్నలిస్టులు ఎంతో కష్టపడ్డారని.. వారంటే బీఆర్‌ఎస్ కు ఎంతో గౌరవం ఉందన్నారు. నేను జర్నలిస్టులను అవమానించానని అంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని వ్యాఖ్యానించారు. మా కళ్ల ముందే మూసీ పేరుతో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ప్రశ్నించవద్దా అని కేటీఆర్ నిలదీశారు. మూసీ విషయంలో మాకన్నా ఎక్కువ పోరాడాల్సిన బాధ్యత మీడియాదే అని అన్నారు. రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రహస్య మిత్రుడని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులు కూల్చేస్తారని బండి సంజయ్ బాధపడిపోతున్నాడని పొంగులేటి ఇంటి మీద రైడ్ జరిగి 20 రోజులైనా ఎవరూ మాట్లాడారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతుందని సిద్ధరామయ్య అంటున్నారు.బీఆర్‌ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు. 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం అన్నది వాస్తవం కాదా? వారికి మీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.