– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో రాజకీయ పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి అధికారం అందిపుచ్చుకునేందుకు బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. కవార్ధాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.‘ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడ లవ్ జిహాద్ పూర్తిగా నిషేధం. దీనికి వ్యతిరేకంగా చట్టం చేశాం. చత్తీస్గఢ్లో కూడా లవ్ జిహాద్, గోవుల అక్రమ రవాణా, మైనింగ్ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ను ఇంటికి పంపి.. బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని మిమ్మల్ని కోరుతున్నా’అని ఆయన అన్నారు. చత్తీస్గఢ్ ప్రాంతంతో ఉత్తరప్రదేశ్ ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇలాంటి పవిత్ర భూమిపై ప్రజలకున్న విశ్వాసాలతో కాంగ్రెస్ ఆడుకోవడం దుర్మార్గమన్నారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ నేతృత్వంలో చత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటైందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ‘2003 నుంచి 2018 వరకు రమణ్ సింగ్ నాయకత్వంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచింది. అయితే, ఐదేళ్లుగా ఇక్కడ అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడుతూ.. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సలిజం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. దేశానికి కాంగ్రెస్ పెద్ద సమస్య. సుపరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు భాజపా ప్రమాణాలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే వీటిని చూడగలం’అని సీఎం యోగి అన్నారు.