ఇదేనిజం, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల్ లోని నందిగామ గ్రామము లో వీధి కుక్కలు ఏ గల్లీలో చూసిన డజన్లకొద్దీ కలియ తిరుగుతూ, స్వైరవిహారం చేస్తున్నాయని, బాటసారులను, బైకర్లను, ఆయా ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అదేవిధంగా ఒంటరిగా కనిపించిన వ్యక్తులను, స్కూల్ పిల్లలను తరుముతూ..ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పలుమార్లు ముకుమ్మడిగా దాడులు చేస్తూ..భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు వీటిని చూసి స్కూల్ కు వెళ్లడానికి జంతుతున్నారు. బాల బడికి వెళ్లే చిన్నారులకు వీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది. వీధి కుక్కలు రాష్ట్రంలో అనేకచోట్ల పసిపిల్లలను పొట్టనపెట్టుకున్న సంఘటనలను గుర్తు చేసుకుంటే పసిపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని కబలిస్తాయోనని పసిపిల్లల తల్లిదండ్రులు, గ్రామా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ వీధి కుక్కలను ఇలాగే వదిలేస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని, ఎవరికి ఏ హాని జరగకముందే వీటిని బంధించి ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. కుక్కల వల్ల ప్రమాదాలు ఉన్నాయని సెప్టెంబర్ 20వ తేదీన నల్లబెల్లి మండలం ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయిన ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇట్టి విషయం పై ఎంపీడీవో ను వివరణ కోరగా తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.