ఇదేనిజం, వెబ్ డెస్క్: మాజీ డీఎస్పీ నళిని పేరు సోషల్ మీడియాలో మరోసారి వినిపిస్తోంది. తెలంగాణ కోసం తన డీఎస్పీ పదవికే రాజీనామా చేసింది కాబట్టి.. ఆమెకు అందరూ సపోర్ట్ చేయాలని పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ హాయంలో ఆమె పేరు పెద్దగా వినిపించలేదు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారి రేవంత్ సర్కారు కొలువుదీరగానే మళ్లీ నళిని పేరు తెరమీదకు వచ్చింది. సోషల్ మీడియాలో ఫుల్ హైప్ ఉంది కనక రేవంత్ కూడా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగంలో చేర్చుకోవాలని అధికారులను ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.
నళిని నిజంగానే తెలంగాణ కోసమే రాజీనామా చేశారా? అయితే ఆమె ప్రధాన స్రవంతి ఉద్యమంలో ఎందుకు కనిపించలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కేసీఆర్, కోదండరామ్ వంటి లీడర్ల వెంట ఎందుకు లేరు ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి నళిని కేవలం అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేశారని.. తెలంగాణ కోసం కాదని కూడా పోలీస్ వర్గాల్లో టాక్ ఉంది. ఆమె మొదటి సారి 2009 డిసెంబర్ 9న తన డీఎస్పీ పోస్టుకు రిజైన్ చేశారు. కొంతకాలం ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమం సాగుతుంటే నళిని మాత్రం ఢిల్లీ వెళ్లి.. బీజేపీ నేతలతో కలిసి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశారు. ఇదిలా ఉంటే రాజీనామా చేసిన నళిని కొన్ని నెలలకే మళ్లీ ఉద్యోగంలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే అనూహ్యంగా మరోసారి 2011 నవంబర్ 1న మళ్లీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు.
పరకాలలో పోటీ?
ఇక 2012 జూన్ లో పరకాలకు ఉప ఎన్నిక జరిగింది. వైఎస్ జగన్ కు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా వారిలో కొండా సురేఖ కూడా ఉన్నారు. ఇక వైఎస్సాసీపీ అప్పట్లో తమది సమైక్యవాదమని ప్రకటించింది. ఇక ఆంధ్రా ప్రాంతానికి చెందిన సమైక్య వాది, అప్పటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొండా సురేఖకు సపోర్ట్ చేశారు. ఆ ఎన్నిక సమైక్యవాదానికి తెలంగాణ వాదానికి మధ్య జరిగింది. అప్పట్లో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని నళిని భావించారు. జేఏసీ మద్దతు కోరేందుకు కోదండరామ్ దగ్గరకు వెళ్లారు. అయితే అప్పట్లో టీఆర్ఎస్ పోటీ చేయడంతో ఆయన మద్దతు ఇవ్వలేలు. దీంతో నళిని ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. హోరాహోరీగా తెలంగాణకు చావో రేవో అన్నట్లుగా జరిగిన పరకాల ఉపఎన్నికలో తెలంగాణ ఉద్యమ అభ్యర్థి మొలుగూరి బిక్షపతి సమైక్య అభ్యర్థి కొండా సురేఖ పై విజయం సాధించడంతో ఉద్యమం మళ్లీ బలోపేతం అయింది. ఆ ఎన్నికల్లో తెలంగాణ వాదుల ఓట్లు చీల్చి సమైక్య వాదులకు మేలు చేసేందుకే నళిని పోటీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఆమె కేవలం కొండా సురేఖకు మేలు చేసేందుకే పోటీ చేశారని వార్తలు వచ్చాయి. నళిని అప్పుడు కొండా సురేఖ పన్నిన వ్యూహంలో పావుగా మారిపోయారన్న విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఈ ఎన్నికల్లో నళిని 500 ఓట్లు తెచ్చుకుని ఘోరంగా ఓడిపోయారు. ఆమెకు అప్పుడు తెలంగాణ లో పలు చోట్ల తెలంగాణ ఉద్యమ కారులనుండి నిరసనలు విమర్శలు ఎదురయ్యాయి.
*కేసీఆర్ మీద విమర్శలు
ఇక అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నళిని కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ప్రధాన స్రవంతి ఉద్యమంలో పాల్గొనకుండా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయడం.. ఓ సారి రాజీనామా చేసి మరోసారి ఉద్యోగం చేరడంతో ఆమెకు తెలంగాణ ఉద్యమకారుల నుంచి పెద్దగా సపోర్ట్ దక్కలేదు. పైగా పరకాలలో పోటీ చేసిన అనంతరం ఆమెకు తెలంగాణ ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించారు కనక నళిని విషయంలో సీఎం రేవంత్ సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించి.. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన నళిని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ని కలుసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.