Homeహైదరాబాద్latest Newsముసలోల్లకు దసరా పండగ.. వయసుమళ్లినా పదవులపై చావని యావ

ముసలోల్లకు దసరా పండగ.. వయసుమళ్లినా పదవులపై చావని యావ

ఇదేనిజం, తెలంగాణ: ఆ లీడర్లకు వయసు మీద పడ్డా పదవి మీద యావ చావలేదు. కీలక సమయంలో కన్నతల్లి లాంటి పార్టీకి సున్నం పెట్టారు. వారికి పార్టీలో ఏ అవమానమూ జరగలేదు. అర్హతకు మించిన ప్రాధాన్యం దక్కింది. పార్టీలోని లీడర్లు వద్దంటున్నా సదరు లీడర్లకు బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అనేక పదవులు ఇచ్చారు. పార్టీలో సముచిత గౌరవం ఇచ్చారు. ఈ వృద్ధ నారీ పతివ్రతలు ఇంతకాలం పార్టీలో కీలక పదవులు అనుభవించి.. ఎంతో లాభం పొంది.. కేసీఆర్​ పంచన చేరి ఎంజాయ్ చేశారు. బీఆర్ఎస్​ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ పార్టీకి తీరని ద్రోహం తలపెట్టి వెళ్లిపోయారు. ఇంతకాలం పదవులు అనుభవించిన పార్టీ మీద నాలుగు రాళ్లు వేసి మరీ చిన్నగా జారుకున్నారు. ఈ వయసులోనూ పదవుల కోసం వెంపర్లాడారు. ఈ కురువృద్ధులను చూసి బీఆర్ఎస్​ కేడర్​ చీత్కరించుకోవడంలో ఆశ్చర్యం లేదు కానీ.. సాధారణ ప్రజలు సైతం ‘థూ’.. అని ఉమ్మేసినంత పనిచేస్తున్నారు. ఈ లీడర్లే కడియం శ్రీహరి(72), కే కేశవరావు(85), గుత్తా సుఖేందర్​ రెడ్డి(70), అల్లల్లో ఇంద్రకరణ్​ రెడ్డి(76). వీరంతా డెబ్బై ఏండ్ల పైబడ్డ వారే. ఈ వయసులో పార్టీని వీడటం పట్ల సోషల్​ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ నడుస్తోంది. ఈ వృద్ధ జంబుకాలు ఎవరూ గొప్ప మాస్​ లీడర్లు కాదు. పార్టీ బలం లేకుండా గెలవడం కూడా కష్టమే. కానీ అటువంటి లీడర్లకు కేసీఆర్​ ఆశ్రయం ఇచ్చారు. తమ పార్టీకి ఉపయోగపడతారని.. సీనియర్ల సూచనలు అవసరమని వీరికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎందరో సమర్థులైన యువనేతలను పక్కకు పెట్టి మరీ వీరికి పదవులు కట్టబెట్టారు కేసీఆర్​. టికెట్లు రాకపోతోనే పదవులు రాకపోతేనే పార్టీ మారడం మాములే.. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్​, కేకే రాజ్యసభ సభ్యుడు, కడియం ఎమ్మెల్యే అయినా పార్టీ మారాలని చూడటం గమనార్హం.

కేకేకు అందలం
కేకే కు పార్టీలో అత్యున్నత పదవి ఇచ్చారు. పార్టీ సెక్రటరీ జనరల్​ హోదా ఇచ్చారు. కుటుంబపార్టీల్లో ఇంత పెద్ద పోస్టు బయట వ్యక్తులకు ఇవ్వడం అత్యంత అరుదు. కేసీఆర్​ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్ట్​ ఇది.. ఏ పార్టీ సమావేశమైనా కేసీఆర్​ కేకేను పక్కనే కూర్చోబెట్టుకొనేవారు. ఇటువంటి కష్టకాలంలో కేసీఆర్​ కు అండగా నిలబడాల్సింది పోయి .. దారుణంగా వెన్నుపోటు పొడిచి కేకే వెళ్లిపోయారని బీఆర్ఎస్​ కేడర్​ ఆగ్రహంగా ఉంది. కేకే కూతురికి ఏ అర్హత లేకపోయినా జీహెచ్ఎంసీ మేయర్​ పోస్టులో కూర్చోబెట్టారు. కనీస రాజకీయ​ అవగాహన లేకపోయినా.. ఆమె తీరుతో పార్టీకి నష్టమని తెలిసినా కేవలం కేకే మొహం చూసి ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు కేసీఆర్​. ఇక కేకే కుమారుడు విప్లవ్​ కు కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. రెండు పర్యాయాలు కేకేను రాజ్యసభకు పంపించారు. కేకే మీద అనేక భూ కబ్జా ఆరోపణలు వచ్చినా ఆయనను టచ్​ చేయలేదు కేసీఆర్. ​ ఇప్పుడు బీఆర్ఎస్​ పవర్​ కోల్పోగానే కేకే తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కడియంకు కొంచెమైనా ఉందా?
ఇక కడియం శ్రీహరి తెలుగుదేశం మూలాలున్న నేత. ఓడిపోయిన ఈ నేతను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికే చాలా మంది బీఆర్ఎస్​ ముఖ్యులు వారిస్తున్నా కేసీఆర్​ ఆయనను చేరదీశారు. దళిత సామాజికవర్గం వర్గం కావడం.. మేధావి అన్న పేరు ఉండటంతో కేసీఆర్​ కండువా కప్పారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు. కీలక శాఖలు అప్పజెప్పారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను పక్కకు పెట్టి మరీ కడియంకు ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చారు. కడియం కూతురు కావ్యకు ఇటీవల ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ.. టికెట్​ కాదని కొని మరీ తండ్రీకూతుళ్లు పార్టీ మారారు. పోవడమే కాకుండా బీఆర్ఎస్​ పార్టీ మీద నిలాపనిందలు వేసి మరీ జారుకున్నారు. నిన్నటిదాకా కారు గుర్తుకు ఓటేయమన్న కడియం.. ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేస్తుంటే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. కడియం శ్రీహరిని చూసి చీత్కరించుకుంటున్నారు. బీఆర్ఎస్​ కేడర్​ లో కడియం మీద వచ్చినంత వ్యతిరేకత మరే ఇతర లీడర్​ మీదా రాలేదు. బీఆర్ఎస్​ పవర్ లో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కడియం.. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. కడియం శ్రీహరి వెన్నుపోటు రాజకీయం నేడు ఆయన బిడ్డ గెలుపునకు పెద్ద అడ్డుగా మారటమే కాకుండా చివరి దశలో ఆయనకు రాజకీయ సమాధిగా మారుతున్నది అన్న విమర్శ ముమ్మాటికీ నిజం.

గుత్తాది మరో హీన చరిత్ర
నల్లగొండ జిల్లాలో పెద్దగా పత్తాలేని ఈ సీనియర్​ లీడర్​కు కేసీఆర్​ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. మండలి చైర్మన్​ పదవిని కట్టబెట్టారు. గుత్తా సుఖేందర్ రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచి 2016, జూన్ 15న బీఆర్ఎస్​ లో చేరాడు. 2018, మార్చిలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయనను రైతు స‌మ‌న్వయ స‌మితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఈ పదవి కూడా కేబినెట్​ ర్యాంక్​ ఉన్న పోస్టే. రెండు సార్లు బీఆర్ఎస్​ పార్టీలో ఎమ్మెల్సీగా పదవి అనుభవించారు. మండలి చైర్మన్​ పదవిని అనుభవించారు. ఈ పోస్ట్ ఎంతో కీలకం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రొటోకాల్ ఉన్న పదవి. ఇక గుత్తా తన కొడుకు అమిత్​ కు నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించారు. సీటు ఇచ్చేందుకు కేసీఆర్​ సుముఖంగానే ఉన్నారు. అయినప్పటికీ తన కుమారుడిని కాంగ్రెస్​ పార్టీలోకి పంపించారు. కేవలం సాంకేతిక సమస్యల వల్ల గుత్తా బీఆర్ఎస్​ పార్టీలో కొనసాగుతున్నారు కానీ.. దాదాపు పార్టీని వీడినట్టే.

అల్లకల్లోలుడు అయినా అందలం
ఇక ఇటీవల బీఆర్ఎస్​ పార్టీకి గుడ్​ బై చెప్పిన అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి చరిత్రా తక్కువది కాదు.. ఈయనకు 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ పార్టీ కనీసం టికెట్​ ఇవ్వలేదు. బీఎస్పీ టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్​ పార్టీ పవర్ లోకి రాగానే ఆ పార్టీలో చేరిపోయారు. సీనియర్​ లీడర్ కావడంతో కేసీఆర్​ కేబినెట్ లోకి తీసుకున్నారు. రెండో పర్యాయం బీఆర్ఎస్​ టికెట్​ మీద పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ కేబినెట్ ర్యాంకే. ఇంద్రకరణ్​ రెడ్డి కోసం ఎందరో బీఆర్ఎస్​ లీడర్లు తమ రాజకీయ భవిష్యత్​ ను ఫణంగా పెట్టారు. కూచాడి శ్రీహరి రావు ఉద్యమకారుడు. మొదటి నుంచి బీఆర్ఎస్​ వెన్నంటే ఉన్నాడు. ఇక కూచాడి రాజకీయ జీవితం అల్లోల వల్లే అల్లకల్లోలంగా మారింది. ఇక ఇంద్రకరణ్​ రెడ్డి మీద లేని ఆరోపణలు లేవు.. ఇసుకదందా ఆరోపణలు పత్రికల ప్రధాన శీర్షికలకు ఎక్కాయి. అయినా కేసీఆర్ క్షమించారు. ఇంతా చేస్తే .. ఫలితాలు వచ్చిన రోజే కాంగ్రెస్​ పార్టీలోకి జంప్​ అయ్యేందుకు ఇంద్రకరణ్​ రెడ్డి ప్రయత్నించారు. స్థానిక నేతలు అడ్డం పడటంతో ఇంతకాలం ఆగి ఇప్పుడు హస్తం కండువా కప్పుకున్నారు. ఇలా ఈ నలుగురు వృద్ధ నేతలు కీలక సమయంలో బీఆర్ఎస్​ ను వీడారు. ఈ వయసులో పార్టీలు మారిన ఈ వృద్ధ నేతలు ఏం బావుకుంటారో చూడాలి మరి.

Recent

- Advertisment -spot_img