– ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిసరాల్లో భూ ప్రకంపనలు
– భయాందోళనతో ఇండ్లు, ఆఫీసుల
నుంచి బయటికి పరుగులు తీసిన జనం
– ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తీవ్ర భూప్రకంపనలు సంభవించాయి. పొరుగున ఉన్న నేపాల్‌లో వరుసగా భూకంపాలు రావడంతో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ- ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి బలంగా కంపించింది. ప్రకంపనలు రావడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, హాపుర్, అమ్రోహా, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో తొలిసారి భూ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. తొలుత అది 4.6 తీవ్రతతో రికార్డయ్యింది. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్‌సీఎస్ గుర్తించింది.