ఇదే నిజం, నేషనల్ బ్యూరో: అశోక యూనివర్సిటీ వ్యవస్ధాపకులకు సంబంధించిన 17 ప్రదేశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. పరబోలిక్ డ్రగ్స్ కేసులో ఢిల్లీ, ముంబై, చండీఘఢ్, పంచ్‌కుల, అంబాలాలోని 17 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఈ కేసులో పరబోలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు, ప్రమోటర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా ఏకంగా రూ. 1600 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌కు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. వినీత్ గుప్తా, ప్రణవ్‌గుప్తా అశోకా యూనివర్సిటీ వ్యవస్ధాపకులుగా దర్యాప్తులో వెల్లడైంది. పరబోలిక్ డ్రగ్స్ కేసులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. కాగా, ప్రముఖ విద్యా సంస్ధ అధినేతలపై ఈడీ దాడులు కలకలం రేపాయి.