– చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలే
– గతంలోనూ దర్యాప్త సంస్థ ఇలాంటి ఆరోపణలే చేసింది
– కేజ్రీవాల్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్ర
– అక్రమంగా ఒక్క రూపాయి లేదన్న ఆప్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడింది. దర్యాప్తు సంస్థ బీజేపీ పొలిటికల్ వింగ్‌లా పనిచేస్తోందని ఆరోపించింది. 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా తదితరులు కుట్ర పన్నారని ఈడీ తమ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్‌సింగ్ అరెస్టు విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ‘గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటనలు విడుదల చేసింది. ఈ కేసులో 500కు పైగా సోదాలు జరిపినా.. వేల మంది సాక్ష్యులను విచారించినా దర్యాప్తు సంస్థకు అక్రమంగా ఉన్నట్లు నిరూపించేలా ఒక్క రూపాయి కూడా లభించలేదు. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదు. అందుకే విసుగెత్తిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఒక్క కొత్త విషయం లేదు. ఇవన్నీ చూస్తుంటే కేసులో తటస్థ దర్యాప్తు విధానాన్ని వదిలేసి.. భాజపాకు పొలిటికల్ వింగ్‌లా ఈడీ పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు’అని ఆ పార్టీ మండిపడింది.