-ఎల్లారెడ్డి కాంగ్రెస్ సీటు ఆశించిన వడ్డేపల్లి సుభాశ్ రెడ్డి
-రెండో జాబితాలో మదన్ మోహన్ కు టికెట్ కేటాయించిన అధిష్ఠానం
-బోరున విలపించిన సుభాశ్ రెడ్డి.. పార్టీకి రాజీనామా
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కోపంతో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్ఠానంపై నిప్పులు చెరుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న నేతలకు కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం టీ కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ దక్కలేదనే ఆవేదనతో కొంతమంది పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ నేతల రాజీనామాలు కాంగ్రెస్‌లో ఆందోళన కల్గిస్తున్నాయి. అధిష్ఠానం టికెట్ రాని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా వడ్డేపల్లి సుభాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి సీటును ఆయన ఆశించారు. కానీ రెండో జాబితాలో మదన్ మోహన్‌కు టికెట్ కేటాయించారు. దీంతో ఆయన శనివారం అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తనకు టికెట్ రాలేదని కంటతడి పెట్టుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.