హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
అఫిడవిట్ దాఖలుకు ప్రతివాదులకు రెండువారాలు గడువు
అమరావతిః ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్కారకు ఊహించిన పరిణామం సుప్రీంకోర్టులో ఎదురైంది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ సర్కారు తీసుకొచ్చిన జీఓ 85ను రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించింది. ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసేందుకు రెండువారాలు గడువు ఇచ్చిన అత్యున్నత ధర్మాసనం.. ఆ తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. 1వ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 85 గతంలో హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ స్కూళ్లల్లో అడ్మిషన్లు తగ్గినయ్
విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వాదనను సీనియర్ న్యావాది విశ్వనాథన్ బలంగా వినిపించారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన విద్యాహక్కు చట్టంలో ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియంలో బోధించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్ మొగ్గు చూపడం లేదని దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా తగ్గిపోతుందని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. విద్యాబోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయంగా విశ్వనాథన్ అభివర్ణించారు. విద్యార్థులు తమకు నచ్చిన మీడియంను ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తోందని ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది శంకర్ నారాయణ్ వాదనలు విన్పించారు. తెలుగు మీడియం పాఠశాలలను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఏపీ సర్కార్ వినతికి నో చెప్పిన సుప్రీం కోర్టు
RELATED ARTICLES