Homeహైదరాబాద్latest Newsఎండమంటల్లో వర్షాలు..దేనికి సంకేతాలు

ఎండమంటల్లో వర్షాలు..దేనికి సంకేతాలు

Idenijam, Webdesk : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఎండమంటల నుంచి ఉపశమనం లభించినా..రైతులకు మాత్రం తీరని అన్యాయమే జరిగింది. మొక్కజొన్న, వేరుశెనగ, తదితర పంటలు కోతకు వచ్చే సమయంలో ఈదురుగాలుతో కూడిన వర్షాలకు నేలకొరిగాయి. వందల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.

మరోవైపు కల్లాలు, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొంటామని పౌరసరఫాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేసినా మద్దతు ధర రావడం కష్టంగానే ఉంది. మద్దతు ధర కాకపోయినా కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇలాంటి హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రకృతి విపత్తుల నుంచి పంటల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానిపై ఉంది. ఇప్పుడు మొదలుపెడితే కానీ మూడు, నాలుగు నెలల దాకా పరిహారం అందే పరిస్థితి లేదు.

ఈ డిజిటల్ యుగంలో సాంకేతికతను వాడుకొని వేగంగా పనులు జరిపించుకుంటున్న సంస్థలు, ప్రభుత్వాలు ఉన్నా..రైతులు, వ్యవసాయం విషయంలో మాత్రం స్థానిక ప్రభుత్వాలు అలసత్వం వహిస్తూ కాలయాపన చేస్తున్నాయి. పంట నష్టం పరిహారాన్ని 90 రోజుల్లోగా అందజేస్తామని నాయకులు చెబుతున్నా..అది వచ్చేసరికి కనీసం సంవత్సరం పడుతుందని కొందరు రైతులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.

హైదరాబాద్‌లో ఉప్పొంగిన డ్రైనేజీలు, ట్రాఫిక్ జాం

మరోవైపు హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో గంటలకొద్దీ వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

జూబ్లీహిల్స్ కృష్ణానగర్ ప్రాంతం లోతట్టు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షాలకే వరదలతో డ్రైనేజీలో ఉప్పొంగుతున్నాయి. పాదచారులు మ్యాన్‌హోల్‌లో పడి మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను రూపుదిద్దాల్సిన అవసరం ఉంది.

హెచ్చరికలు పట్టవా..

ఆధునికీకరణలో భాగంగా మానవ తప్పిదాలతో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. వర్షం, ఎండ, చలి, తేమ ఇలా కాలం కాని సమయాల్లో వాతావరణ పరిస్థితులు మారుతూ మానవాళికి హెచ్చరికలు పంపుతున్నా కొందరు మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం ఎడారి దేశం దుబాయ్‌ కుంభవృష్టితో అతలాకుతలమైంది. విమానాశ్రయంలోని రన్‌వేపైకి వరదలు రావడంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రకృతి విరుద్ధంగా చేస్తోన్న మానవ కార్యకలాపాలే వరదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యాధునిక మౌళిక వసతులు కల్పిస్తున్నా సరిపోవడం లేదు. హైదరాబాద్ మెట్రో రైల్ ఇందుకు నిదర్శనం. రద్దీ సమయాల్లో హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే మార్గంలో దాదాపు 10 ట్రైన్లు వచ్చివెళ్తున్నా ప్లేస్ మాత్రం దొరకడం లేదు. ఇటువంటి సంఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించి, సమస్యల్ని పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పర్యావరణ హితం కోసం ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టును మరింత విస్తృత పరిస్తే ప్రయోజనకరంగా ఉంటుందనేది విశ్లేషకులు అభిప్రాయం.

Recent

- Advertisment -spot_img