EV Charging in Petrol Pump : ఎలక్ట్రిక్ వాహనాలకు ఇక బంకుల్లో చార్జింగ్
EV Charging in Petrol Pump | దేశమంతా క్రమంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా కదులుతున్నది.
అయితే, విద్యుత్ వాహనాలకు కీలకం చార్జింగ్ ఫెసిలిటీ.
ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ముడి చమురు సంస్థలు, ఆటోమొబైల్ సంస్థలు వడివడిగా అడుగులేస్తున్నాయి.
తాజాగా దేశంలోని రిటైల్ పెట్రోల్ పంప్‌లను చార్జింగ్ స్టేషన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న 70 వేల పెట్రోల్ పంపుల వద్ద 22 వేల ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ సాగుతున్నది.
హైవేలు, సిటీలు తొలి ప్రాధాన్యం ( EV Charging in Petrol Pump )
ఎక్స్‌ప్రెస్ హైవేస్, హైవేస్, జన సమ్మర్ధ నగరాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శుక్రవారం రాజ్యసభకు చెప్పారు.
హైవేకు ఇరువైపులా ప్రతి 25 కి.మీ.లకు కనీసం ఒక చార్జింగ్ స్టేషన్ తప్పనిసరిగా ఒక చార్జింగ్ స్టేషన్, దూర శ్రేణి, భారీ విద్యుత్ వాహనాలకు ప్రతి 100 కి.మీ.లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
ఇక ఏదేనీ ఒక నగరంలో గ్రిడ్ పరిధిలో మూడు కి.మీ.లకు ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తేవాలని విద్యుత్ శాఖ గైడ్‌లైన్స్ నిర్దేశించిందన్నారు.
ప్రొటోటైప్ యంత్ర తయారీపై పుణె సంస్థ కసరత్తు
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రీడ్) ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్-2) కింద విద్యుత్ వాహనాలకు ప్రొటోటైప్ ఫాస్ట్ చార్జింగ్ యంత్రాల తయారీ, అభివృద్ధిపై పుణెలోని అరాయ్ సంస్థ కసరత్తు చేస్తున్నదని పాండే తెలిపారు.
2022 డిసెంబర్ నాటికి మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అక్టోబర్, నవంబర్ కల్లా ప్రొటోటైప్ మిషన్ సిద్ధం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు విషయమై ఫేమ్ ఇండియా విధానం అమలు చేయడానికి పెట్రోలియం, విద్యుత్, భారీ పరిశ్రమలశాఖలు సంయుక్తంగా పని చేస్తున్నట్లు తెలిపారు.
లిథియం బ్యాటరీల్లో స్వయంసమృద్ధికై ఇలా
అదే టైంలో ఈవీల్లో కీలకమైన లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధన ప్రక్రియ సాగుతున్నదని మహేంద్రనాథ్ పాండే చెప్పారు.
ఇందుకోసం పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ) కింద రూ.18,100 కోట్లు కేటాయించామని చెప్పారు.
ఇందుకు పరిశ్రమ నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ కోరామని, ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించిందన్నారు.
లిథియం బ్యాటరీల తయారీలో స్వయం సమృద్ధి సాధన దిశగా శరవేగంగా అడుగులేస్తున్నామని అన్నారు.