మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. హెచ్‌ఐవీకి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం. HIV అంటే.. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ బాడీలోకి ఎంటరయిన తర్వాత.. రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయడం మొదలు పెడుతుంది. శరీరంలో విస్తరిస్తూ అన్ని వ్యవస్థల్నీ నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా రోగాలపై పోరాడే శక్తి కోల్పోతారు. పరిస్థితి తీవ్రమైన చివరి దశనే AIDS అంటారు. వైరస్‌ను అదుపుచేస్తూ.. ఇతర దీర్ఘకాలిక రోగుల మాదిరిగా మందులు వాడుతూ ఎక్కువ కాలం సాధారణ జీవితం గడపవచ్చు.హెచ్ఐవీ ఉన్నవారందరికీ ఎయిడ్స్‌కు దారి తీస్తుందని చెప్పలేం. HIV సోకివవారికి తరచుగా జబ్బు పడుతూ ఉండటం.. పదే, పదే ఇన్‌ఫెక్షన్స్ సోకడం.. అదే విధంగా రక్తంలో తెల్ల రక్తకణాలు స్థాయికి మించి పడిపోతే ఎయిడ్స్ సోకినట్టు డాక్టర్లు నిర్ధారిస్తారు. రక్తపరీక్ష ద్వారా హెచ్ఐవీ సోకిందని నిర్ధారిస్తారు. HIV సోకిన తొలి దశలో సింటమ్స్ కనిపించకపోవచ్చు. తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, గొంతు నొప్పి, జ్వరం, బరువు తగ్గడం, విరేచనాలు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసురక్షిత శృంగారం, హెచ్ఐవీ ఉన్నవారికి వాడిన సూదులు, సిరంజిలను ఇతరులకు వాడడం, HIV సోకినవారి రక్తాన్ని మరొకరిని ఎక్కించడం ద్వారా హెచ్ఐవీ సోకుతుంది. హెచ్ఐవీ ఉన్న తల్లుల నుంచి పిల్లలకు సోకుతుంది. అయితే మందుల ద్వారా బిడ్డకు సోకకుండా జాగ్రత్త పడొచ్చు. ఎయిడ్స్ రోగులను హత్తుకున్నా, వారికి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆ వ్యాధి రాదు. హెచ్ఐవీ చాలా సున్నితమైన వైరస్. ఇది మన రక్తంలో కాకుండా బయట ఏమాత్రం జీవించలేదు. బాహ్య వాతావరణంలోకి వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ వైరస్ మరణిస్తుంది. అందుకే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులతో కలిసి ఆహారం తిన్నా, వారిని తాకినా ఈ వైరస్ వ్యాప్తి చెందదు. సుఖవ్యాధుల ఉన్నవారికి HIV సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. శృగారంలో కండోమ్ తప్పక వాడాలి. అయితే, కండోమ్ చిరిగినా, జారినా, లీక్ అయినా హెచ్ఐవీ సంక్రమించే ప్రమాదం ఉంది. యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా వైరస్ లక్షణాలను తగ్గించవచ్చు. ఈ చికిత్సలో భాగంగా డాక్టర్లు యాంటీరెట్రోవైరల్ మెడిసిన్ ఇస్తారు. హెచ్‌ఐవీపై నియంత్రణ సాధించగల యాంటీ రెట్రోవైరల్ మందులు కనుగొన్న తర్వాత.. హెచ్‌ఐవీ రోగులు సైతం అందరిలాగే దీర్ఘకాలం బతుకుతున్నారు.