EX-CM KIRAN KUMAR REDDY: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -09 మధ్య కాలంలో శాసనసభలో ప్రభుత్వ విప్ గా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా.. 2010 14 మధ్య కాలంలో ఏపీ16వ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
ఆంధ్ర ప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో పార్టీ స్థాపించి ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయారు.. ఆ తరువాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ అనంతరం మళ్లీ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరారు. కానీ పెద్దగా యాక్టీవ్ గా లేరు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత మెరుగుపడుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని చెప్పారు. 1952నుంచి తమ పార్టీ కాంగ్రెస్ లో ఉందని, అసలు తాను కాంగ్రెస్ ను వీడతానని ఎప్పుడూ అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిందన్నారు.
కాంగ్రెస్ కు కేవలం పవర్ మాత్రమే కావాలన్న ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో హైకమాండ్ తెలుసుకోలేదని, చేసిన తప్పులేంటీ అని కూడా తెలుసుకోవడం లేదంటూ కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటముల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవడం లేదని విమర్శించారు.