Homeహైదరాబాద్latest Newsరైతు రుణమాఫీ ఎఫెక్ట్.. రేవంత్ డైవర్షన్ డ్రామా..!

రైతు రుణమాఫీ ఎఫెక్ట్.. రేవంత్ డైవర్షన్ డ్రామా..!

  • రుణమాఫీ కాకపోవడంతో రైతుల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహావేశాలు
  • ముఖ్యమంత్రి దిష్టిమొమ్మలతో శవయాత్రలు
  • డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిన సీఎం
  • హరీశ్ రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు
  • బీఆర్ఎస్, బీజేపీ విలీనం అంటూ చిట్ చాట్
  • అసందర్భంగా కేసీఆర్​ పై దూషణలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అందెవేసిన చేయి. మీడియాకు మసాలా వార్తలు అందివ్వడంలో.. ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వ్యూహం అమలు చేసి నిత్యం లైమ్ లైట్ లో ఉన్న రేవంత్ ఇప్పుడు పవర్ లో ఉన్నా అదే పంథా కొనసాగిస్తున్నారు. తాజాగా సర్కారు చేసిన రుణమాఫి బూమరాంగ్ అయ్యింది. రైతుల నుంచి మైలేజీ రాకపోగా.. తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అందరికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు రగిలిపోతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్రలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ రైతు బంధు విడుదల చేస్తే రైతుల కండ్లల్లో ఆనందం కనిపించేది. రాష్ట్రంలో పాలాభిషేకలు జరిగేవి. కానీ ఇప్పుడు ఏ ఊరికి వెళ్లినా రైతుల కండ్లల్లో ఆగ్రహం తప్ప ఆనందం లేదు. రుణమాఫీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే.. ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ భావించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతినడం ఖాయమన్నది రాజకీయ పండితుల మాట. అందుకే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు.

టార్గెట్ హరీశ్
రుణమాఫీ నిధులు విడుదల చేసిన రేవంత్.. వైరా బహిరంగ సభలో రేవంత్ హరీశ్ రావును టార్గెట్ చేశారు. చేసింది 40 వేల కోట్లకు 18 వేల కోట్ల మాఫీ మాత్రమే. అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదని మంత్రులే చెబుతున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. గతంలో చేసిన సవాల్ కు కట్టుబడి హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విధ్వంసానికి దిగారు. మిగిలిన చోట్ల రైతుల దృష్టిని మళ్లించేందుకు ఈ తరహా కుట్ర చేశారు. కానీ ఊరూరా రుణమాఫీకి వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకున్నది. దీంతో కాంగ్రెస్ నేతలకు ఈ విషయం మింగుడు పడటం లేదు. హరీశ్ రావు కు వ్యతిరేకంగా గతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం.. క్యాంప్ ఆఫీసు మీద దాడి చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. తాజాగా మైనంపల్లి హన్మంతరావు అనే కాంగ్రెస్ నేత సిద్దిపేటకు వెళ్లి హరీశ్ రావును రెచ్చగొట్టేలా మాట్లాడారు. సిద్దిపేటలో ఊరేగింపు చేసి హరీశ్ రావుకు సవాల్ చేశారు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ పీక్స్ లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.

విగ్రహం లొల్లి
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఏ పల్లెకెళ్లినా.. రచ్చబండ మీద ఇదే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ సర్కారు మీద రైతన్నలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయం గ్రహించిన రేవంత్ సర్కారు రైతుల ఉద్యమాన్ని దారి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నది. ఎలాగూ అనుకూల పత్రికల్లో ఇందుకు సంబంధించిన వార్తలు రావడం లేదు. మరోవైపు తాజాగా సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. సచివాలయం ఎదుట తెలంగాణ ఉద్యమంతో ఏ సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటని బీఆర్ఎస్ నేతలతో పాటూ తెలంగాణ ఉద్యమకారులు, కవులు కళాకారులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారడంతో సీఎం రేవంత్ మళ్లీ నోటికిపనిచెప్పారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్​ పై అకారణంగా నోరు పారేసుకున్నాడు. అసందర్భంగా ఆయనను అనరాని మాటలు అన్నాడు. ‘కేసీఆర్​ సస్తే ఆయన విగ్రహం పెడతారా? తాగు బోతు సన్నాసి’ అంటూ నోరు జారారంటే ముఖ్యమంత్రి ప్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ను నమ్ముకొని రుణమాఫీ అంశం తప్పుదారి పట్టేలా చేస్తున్నారు. కానీ రైతులు అంత అమాయకులేం కాదు.. అన్ని విషయాలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కీలెరిగి వాత పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Recent

- Advertisment -spot_img