Homeహైదరాబాద్latest Newsపొక్కిలాయే రైతు బతుకు.. పగబట్టిన ప్రకృతి.. కరుణ చూపని ప్రభుత్వం..!

పొక్కిలాయే రైతు బతుకు.. పగబట్టిన ప్రకృతి.. కరుణ చూపని ప్రభుత్వం..!

  • పగబట్టిన ప్రకృతి
  • కరుణ చూపని ప్రభుత్వం
  • ఏ మూలకు సరిపోని పీఎం కిసాన్​ యోజన
  • రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ మోసం
  • గ్రామాల్లో తగ్గుతున్న భూముల ధరలు
  • పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల ఇంటి చుట్టూ అన్నదాత ప్రదక్షణలు
  • కూలీ రేట్లు పెరిగి.. దిగుబడి తగ్గి రైతు ఆపసోపాలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మళ్లీ పాతరోజులొచ్చాయి. బీడుబారిన భూములు, ఎండిపోయిన కాల్వలు, అడుగంటిన చెరువులు కనిపిస్తున్నాయి. పెట్టుబడి పైసల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల కాళ్లు మొక్కే దుస్థితి దాపురించింది. గతంలో కళకళలాడిన రైతు కుటుంబాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. సకాలంలో రైతు బంధు అందుకొని.. తలెత్తుకొని వ్యవసాయ పనులు మొదలుపెట్టిన అన్నదాత.. ఇప్పుడు సావుకారి ఇంటి ముందు తలదించుకొని నిలబడుతున్నాడు. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన ఏ మూలకు సరిపోవడం లేదు. దీంతో అన్నదాత కండ్లు చెమ్మగిల్లుతున్నాయి.

పదేండ్లు ఎట్లుండే..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఇక్కడి రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడం.. రైతుకు ఎకరాకు రూ. 10,000 ఆర్థిక సాయం అందడంతో రైతన్న కాస్త తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. పెట్టబడి సాయం కోసం వడ్డీ వ్యాపారుల ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితి కొంత తగ్గింది. కానీ ఇప్పుడు సీన్​ మారింది. ఎకరాకు పది వేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్న కాంగ్రెస్​ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులు పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఫోన్లకు మెసేజులు రావడం లేదు.

పగబట్టిన ప్రకృతి
మరోవైపు ఈ ఏడాది ప్రకృతి కూడా రైతన్న మీద పగబట్టింది. వర్షాలు పడటం లేదు. ఇక అప్పోసప్పో చేసి నాటుకున్న విత్తనాలు మొలుస్తాయో లేదో తెలియదు.. ఒకవేళ మొలకెత్తినా నిలబడతాయన్న నమ్మకం లేదు. జూన్ మాసాంతంలోనూ వానల జాడలేదు. ఇక రాష్ట్రంలో 24 గంటల కరెంట్​, ప్రాజెక్టుల్లో నిండుగా నీరు ఉండటంతో తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరిగాయి. కానీ ప్రస్తుతం ధరలు తగ్గిపోయినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. వ్యవసాయ భూముల ధరలు దాదాపు 30 శాతం వరకు తగ్గినట్టు చెబుతున్నారు. అంతేకాక మార్కెట్ కూడా స్తబ్ధుగా ఉంది.

సేద్యం బంద్​ పెట్టే ఆలోచన
గత ఉమ్మడి పాలనలో తెలంగాణకు చెందిన చాలా మంది రైతులు వ్యవసాయం ఆపేశారు. తమ భూమిని పాలుకో.. కౌలుకో ఇచ్చి పట్నం బాట పట్టారు. ఇక్కడే చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకున్నారు. కానీ కేసీఆర్​ రైతు బంధు ఇవ్వడం.. పల్లెల్లో 24 గంటల కరెంట్​ ఉండటం.. ప్రాజెక్టులు కూడా కళకళలాడటంతో చాలామంది నగరాల్లోచిన్న చితకా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకొనేవాళ్లు సైతం పల్లెటూర్లకు వచ్చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లంతా మళ్లీ పట్నం బాట పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా మారింది. ఓ వైపు కూలీ రేట్లు భారీగా పెరిగిపోయాయి. విత్తనాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రభుత్వ సాయమూ అందడం లేదు. దీంతో వ్యవసాయం ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతు బంధు (రైతు భరోసా) వేసి రైతులను ఆదుకుంటుందేమో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img