Homeహైదరాబాద్latest Newsమొత్తం సాగుభూములకు రైతు భరోసా ఇవ్వాల్సిందే.. రైతుల అభిప్రాయమిదే..!

మొత్తం సాగుభూములకు రైతు భరోసా ఇవ్వాల్సిందే.. రైతుల అభిప్రాయమిదే..!

  • సిలింగ్ పెట్టొద్దు
  • ఖమ్మం జిల్లాలో మొదలైన రైతు భరోసా వర్క్ షాపులు
  • సీలింగ్ పెట్టాలని ప్రభుత్వ యోచన
  • అన్నదాతల నుంచి విభిన్న అభిప్రాయాలు
  • వెంచర్లు, గుట్టలకు ఇవ్వొద్దంటూ ఏకాభిప్రాయం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎకరాలతో సంబంధం లేకుండా మొత్తం సాగుభూములకు రైతు భరోసా ఇవ్వాల్సిందేనని మెజార్టీ రైతులు కుండబద్ధలు కొట్టారు. రైతు భరోసా పథకానికి సీలింగ్ పెట్టడం సరికాదని.. ఐదెకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వడం సరికాదని రైతులు అభిప్రాయపడ్డారు. రైతు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తే మొత్తం అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని మెజార్టీ రైతులు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం బుధవారం ఖమ్మం జిల్లాలో అభిప్రాయ సేకరణ చేపట్టింది. కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు తమ అభిప్రాయాలను చెప్పారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్న పెద్ద రైతు అనే తేడా చూపించొద్దు
రైతు బంధు పథకానికి చిన్న రైతు, పెద్ద రైతు అనే తేడా చూపించొద్దని రైతులు అభిప్రాయపడ్డారట. రెండెకరాలు ఉన్న రైతు వ్యవసాయంతో పాటూ ఇతర పనులు చేస్తారని.. అదే పదెకరాలు ఉన్న రైతు అయితే కేవలం వ్యవసాయం మాత్రమే చేస్తారని రైతులు చెప్పారు. అందుకే ఎకరాలతో సంబంధం లేకుండా సాగు చేసే భూమి మొత్తానికి రైతు భరోసా సాయం ఇవ్వాలని మెజార్టీ అన్నదాతలు చెప్పారట. వాస్తవానికి రైతు భరోసా పథకానికి సీలింగ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఐదెకరాలకు ఈ పథకాన్ని కుదిస్తారని చర్చ సాగింది. ఆ దిశగానే ప్రభుత్వం రైతుభరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే రైతులు మాత్రం అనూహ్యంగా సీలింగ్ కు వ్యతిరేకంగా అభిప్రాయాలు చేపట్టడం గమనార్హం. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలకు ఇవ్వొద్దని రైతులు ముక్త కంఠంతో తమ అభిప్రాయం చెప్పారట.

ఎక్కువ సాగుచేసిన రైతుకు ఎక్కువ పెట్టుబడి
సహజంగా రెండెకరాలు సాగు చేసే రైతులకు పెట్టుబడి కూడా తక్కువగా పడుతోంది. కానీ అదే 20 ఎకరాల రైతులకు సాగు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకే కేసీఆర్ ఎకరాల వారీగా పెట్టుబడి సాయం అందజేశారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా రైతు భరోసా పథకానికి సీలింగ్ పెడితే సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంటుంది. వ్యవసాయ స్థిరీకరణ అనే రైతు బంధు మూలలక్ష్యానికి గండి పడుతుంది. అందుకే రైతు ముక్త కంఠంతో దాదాపుగా ఒకే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. సహజంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పెద్ద రైతులు భారీగా నష్టపోతారు. చిన్న రైతుకు తక్కువ నష్టం వాటిల్లుతుంది. అందుకే రైతు బంధు కూడా సీలింగ్ విధించకుండా ఇవ్వాలన్నది రైతుల అభిప్రాయం.

కౌలు రైతుకు ఎలా ఇస్తారు?
కౌలు రైతును గుర్తించడం ప్రస్తుతం ప్రభుత్వానికి పెద్ద ప్రహసనంగా మారింది. అయితే అసలు కౌలు రైతును ఎలా గుర్తించాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పొలం కౌలుకు ఇస్తున్నట్టు పట్టా రైతులు అఫిడవిట్ రాసిస్తేనే కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పారు. అయితే రైతు భరోసా డబ్బులు వదులుకొనేందుకు ఏ పట్టా రైతు సిద్ధంగా ఉండడు. అందువల్ల కౌలు కు ఇస్తున్నట్టు అఫిడవిట్ రాసివ్వరు. దీనికి తోడు రైతులు అసలు కౌలు ఇవ్వడమే మానేస్తారు. దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది కౌలు రైతులే. తాజాగా ఈ విషయంపై ప్రజాభిప్రాయం జరిగినప్పుడు.. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కాకుండా, ఇతర సహాయలు అందించాలని రైతులు తమ అభిప్రాయం చెప్పారట. వారికి పంట బీమా పథకం, సబ్సిడీపై వ్యవసాయపనిముట్లు అందజేయాలని.. అది కూడా భూమితో సంబంధం లేకుండా అందించాలని రైతులు అభిప్రాయపడ్డారట. భూమికి సంబంధం లేకుండా ఇటువంటి ప్రయోజనాలు కల్పించాలని రైతులు అభిప్రాయపడ్డారు. తొలిరోజు అభిప్రాయ సేకరణలో భాగంగా మంత్రులకు ఎదురైన అనుభవాలు ఇవి.. మరి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి. ఇక రైతుకూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు 12వేలు ఆర్థిక సాయం చేయాలని రైతులు అభిప్రాయపడ్డారు. జాతీయ ఉపాధి గ్రామీణ పథకం జాబ్ కార్డు ఆధారంగా ఆ డబ్బు ఇవ్వొచ్చని రైతులు సూచించారట.

Recent

- Advertisment -spot_img