- కారు-లారీ ఢీకొన్న ప్రమాదంలో కొడుకు మృతి
- చావుబతుకుల మధ్య తండ్రి
- 24 గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు
- ఈ రెండు ప్రమాదాల్లో ఉన్నది తండ్రీకొడుకులే
ఇదే నిజం, కోరుట్ల : మంచి నిద్రా సమయమది.. తెల్లవారుజాము మూడున్నర గంటల టైం..వస్తున్నది 250 కి.మీ.దూరం నుంచి.. మానసికంగా.. శారీరకంగా..
అలసి మాగన్నుగా నిద్రపట్టే ఘడియలో ‘కన్నుమూసి-తెరిచేలోగా’ ఎదురుగా వస్తున్న లారీనీ తప్పించుకోలేక వేగంగా ఢీకొని..నుజ్జునుజ్జైన కారులోనే ప్రాణాలు కోల్పోయారు.కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు సరిగ్గా ఈ నిద్రముంచుకొచ్చే సమయంలోనే జరుగుతుండడం విషాదకరం.
ఉన్నత చదువుల కోసమని..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామ శివారులో గల ‘గండి హనుమాన్’ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మెట్ పల్లి పట్టణానికి చెందిన మహాజన్.శివరామకృష్ణ (45) అతని కుమారుడు మహాజన్.అక్షయ్ (18)లు హైదరాబాద్ నుంచి మెట్ పల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మంచి ర్యాంకు సాధించడంతో స్థానిక ఆర్యవైశ్య సంఘం నుంచి ఉత్తమ ప్రతిభా పురస్కారం అవార్డు పొంది మూడు రోజులైంది.మరింత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్లోని కళాశాల సీటు కోసం బుధవారం తండ్రి కొడుకులు వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్.హెచ్-63 పై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కొడుకు అక్షయ్ కారులోనే కన్నుమూయగా..తండ్రి శివరామకృష్ణకు రెండు కాళ్ళు ఒక చేయి విరగడం తోపాటు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అతన్ని స్థానికులు 108 లో మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేనందున మెరుగైన వైద్య చికిత్సలకోసం నిజామాబాద్ కు తరలించారు.
కాగా..ఉన్నత చదువుల కోసమని హైదరాబాద్ వెళితే.. ఇంటికి తిరిగి రాకముందే.. కానరాని లోకాలకు వెళ్లి ‘పోయావా’ని కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడిపెట్టిస్తున్నాయి.
24 గంటల్లో రెండు రోడ్డు ప్రమాదాలు
బుధవారం మెట్ పల్లికి కారులో బయలుదేరి వస్తున్న తండ్రీకొడుకులు మేడిపల్లి వద్ద చెట్టుకు గుద్దుకుని మృతిచెందగా.. గురువారం తెల్లవారుజామున జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో లారీకి గుద్దుకున్న కారులో ఉన్నది కూడా తండ్రీకొడుకులే కావడం యాదృచ్ఛికం. అయితే మేడిపల్లి లో మృతి చెందిన వారిది..గండి హనుమాన్ వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారిదీ మెట్ పల్లి పట్టణ వాసులే కావడంతో పట్టణంలో విషాదం నెలకొంది. అయితే తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రి శివరామకృష్ణ బతకాలని అందరూ కోరుకుంటున్నారు. కాగా.. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.