మచిలీపట్నం : కుమార్తె సమాధి వద్దే తండ్రి చనిపోయిన ఘటన బందరు నగరం ఇనగుదురుపేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం… కుమ్మరిగూడెం ప్రాంతానికి చెందిన గిరిబాబు (52) గోల్డు కవరింగ్ పని చేస్తుండేవాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దమ్మాయి రేణుకాదేవి (29) 6 నెలల క్రితం మరణించింది. అప్పుడప్పుడు ఆమె సమాధి వద్దకు వెళ్లి బాధపడుతూ వస్తున్నాడు. సోమవారం కూడా అదే విధంగా సమాధి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం వెతకగా కూతురు సమాధి వద్ద మృతి చెంది ఉన్నాడు. కుమార్తె దూరమవ్వడంతో మానసిక వేదనకు గురై మృతి చెందినట్లు గిరిబాబు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు.