ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: పదిహేను నిమిషాల పాటు పోలీసుల్ని తొలగిస్తే, మేం ఏం చేస్తామో చూపిస్తామని 12 ఏండ్ల కిందట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు.. ఫైర్ బ్రాండ్ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తాజాగా కౌంటర్ ఇచ్చారు. 15 నిమిషాలు కాదు.. మాకు 15 సెక్షన్లు సరిపోతుందంటూ ఆమె ఓవైసీ బ్రదర్స్‌కు చాలెంజ్ విసిరారు. 2012 డిసెంబర్లో నిర్మల్‌లో జరిగిన సభలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. 15 నిమిషాలు పోలీసుల్ని తొలగిస్తే.. మేము ఏం చేయగలమో చూపిస్తామని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, అక్బరుద్దీన్ ఓ వర్గాన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. 12 ఏండ్ల కిందటి అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ నవనీత్ కౌర్ కౌంటర్ ఇచ్చారు.
బుధవారం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీ లత తరఫున ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ మాట్లాడారు.‘సోదరా 15 నిమిషాలను పోలీసులను తప్పిస్తే ఏం చేస్తామో చూపిస్తామని మీరు అన్నారు. కానీ సోదరా, మేం 15 సెకన్లు పోలీసులను తొలగిస్తే చాలని అంటున్నాం’ అని ఓవైసీ బ్రదర్స్‌కు నవనీత్ కౌర్ చాలెంజ్ విసిరారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌గా మార్చకుండా మాధవీలత అడ్డుకుంటుందని ఆమె అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎంకు ఓటేస్తే పాకిస్థాన్‌కు అనుకూలంగా ఓటేసినట్లే అవుతుందని నవనీత్ కౌర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు తాను మాట్లాడిన 39 సెకన్ల వీడియోను నవనీత్ కౌర్.. తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ పోస్టును ఓవైసీ బ్రదర్స్‌కు ట్యాగ్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీ లత తన ప్రచారంలో భాగంగా ఓవైసీ బ్రదర్స్‌పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నవనీత్ కౌర్ కౌంటర్ అటాక్‌తో పాతబస్తీలో పాలిటిక్స్ ఆసక్తికంగా మారాయి.
గంట టైమ్ తీసుకోండి.. ఏం చేస్తారో చూస్తాం
అయితే, మరోవైపు నవనీత్ కౌర్ చేసిన కామెంట్స్‌కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నవనీత్ కౌర్‌కు 15 సెకన్ల సమయం ఇవ్వాలని ప్రధాని మోడీని కోరుతున్నట్లు చెప్పారు. ‘ఆమె ఏం చేస్తుంది. 15 సెకన్లు కాదు, గంట టైమ్ ఇవ్వండి. వాళ్లు ఏం చేస్తారో చూడాలని మాకూ ఉంది. ఇక్కడేమైనా మానవత్వం మిగిలి ఉందా? ఎవరూ భయపడేది లేదు. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోవడం లేదు’అసదుద్దీన్ పేర్కొన్నారు.