– గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
ఇదే నిజం, హైదరాబాద్: గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో గన్ పార్కు వద్ద ఉద్రిక్తత నెలకొంది. లిక్కర్, డబ్బు పంపిణీ లేకుండా ఎన్నికలకు వెళదామని, ఇందుకోసం గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సీఎల్పీ ఆఫీసు నుంచి నేరుగా ఆయన గన్ పార్కులోని అమర వీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, నేతలు భారీగా గన్ పార్కు వద్దకు చేరుకున్నారు. అయితే, అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లనీయకుండా రేవంత్ రెడ్డితో పాటు అంజన్కుమార్ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.