– వాంతులు, కడుపులో నొప్పితో అస్వస్థత
– వెంటనే వైద్య చికిత్స అందించిన రైల్వే డాక్టర్లు
– దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రిత్వ శాఖ
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్‌కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్పించారు. అస్వస్థతకు గురైన ప్రయాణికులకు ట్రీట్మెంట్ అందించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ సంఘటన జరిగింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న భారత్ గౌరవ్ రైలులో సుమారు వెయ్యి మంది ప్రయాణించారు. అయితే మంగళవారం పూణె చేరే ముందు ఆ రైలులో ఆహారం తిన్న సుమారు 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు, కడుపులో నొప్పి, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పుణె రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. రైల్వే, స్థానిక డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే రైల్వే స్టేషన్‌కు రప్పించారు. పుణెకు చేరుకున్న ఆ రైలులో అస్వస్థతకు గురైన ప్రయాణికులకు వెంటనే వైద్య చికిత్స అందించారు. మరోవైపు భారత్ గౌరవ్ యాత్ర రైలును ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కలుషిత ఆహారం సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. అనంతరం ఆ కంపెనీపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.