Homeజాతీయంమరో ఐదేళ్లు ఉచిత రేషన్

మరో ఐదేళ్లు ఉచిత రేషన్

– 15 వేల ఎస్​హెచ్​జీ బృందాలకు డ్రోన్లు
– కేంద్ర కేబినేట్​ మీటింగ్​లో కీలక నిర్ణయాలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ప్రయోజాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్‌ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 15 వేల మహిళా ‘స్వయం సహాయక బృందాల’(ఎస్​హెచ్​జీ)లకు డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో మొదలుకొని 2025-26 వరకు డ్రోన్ల అందజేతను కొనసాగించనున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీనికోసం రూ. 1,261 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ డ్రోన్ల ద్వారా ‘స్వయం సహాయక బృందాలు ’గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ ఆధారిత సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఫలితంగా ఒక్కో బృందం ఏటా రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌ టెక్నాలజీని అందించనున్నట్లు ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

కొవిడ్‌ మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత రేషన్‌ పథకం మరికొన్నేళ్లు కొనసాగనుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే దాదాపు 80కోట్ల మంది ప్రజలకు మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌ అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని 2024 జనవరి 1 నుంచి మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబరు 31తో ఈ పథకం ముగియనుండగా.. దీన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని ఇటీవల చత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్రం 2020 ఏప్రిల్‌లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి దీన్ని పలుమార్లు పొడిగిస్తూ వస్తున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున ప్రతి నెలా ఉచిత రేషన్ అందిస్తోన్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img