పుష్ప 2 మూవీలో చూపించిన గంగమ్మ జాతర.. తిరుపతిలో మేలో జరుగుతుంది. ఈ జాతరలో మగవాళ్లు అనేక వేషాలు వేసుకుంటారు. దాదాపు 900 ఏళ్ల క్రితం రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. అప్పటిలో చిత్తూరు పాలెగాడు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడేవాడని, కొత్తగా పెళ్లయిన వధువులందరూ తొలిరాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించేవాడని చెబుతున్నారు. ఆయనను అంతం చేసేందుకు సాక్షాత్తు అమ్మవారు గంగమ్మగా అవతరించినట్లు చరిత్ర చెబుతుంది. తిరుపతికి రెండు కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో అమ్మవారు గంగమ్మగా జన్మించి మహిళలకు రక్షణగా ఉంటారని భక్తుల విశ్వాసం.
అయితే యవ్వనంలోకి వచ్చిన గంగమ్మపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ వెంటాడింది. ఆమెకు భయపడి దాక్కున్న ఆ పాలెగాడి కోసం గంగమ్మ వివిధ వేషధారణలు వేసింది. మూడు వేషాలు వేసినా పాలెగాడు కనిపించకపోవడంతో.. గంగమ్మ నాలుగోరోజు దొరవేషం వేసింది. దీంతో పాలెగాడు బయటికి వచ్చాడు. వెంటనే పాలెగాడిని ఉగ్రరూపంతో గంగమ్మ చంపేసింది. అప్పటి నుంచి గంగమ్మను శక్తిస్వరూపంగా భావించి జాతర చేస్తారు.