ఇదేనిజం, శేరిలింగంపల్లి: గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి ని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం కొల్లూరు ఔటర్ టోల్ గేటు తనిఖీలు నిర్వహించగా బానోతు లక్ష్మణ్ వద్ద 32 కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన గంజాయి ఒక్కోటి 2 కిలోల బరువున్న 16 గంజాయి ప్యాకెట్లు వాటి విలువ 10.50 లక్షల రూపాయలని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్దకు చెందిన లక్ష్మణ్ పటాన్ చెరు పరిధిలోని బానురు వెలిమలలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఔటర్ రింగు రోడ్డు మీదుగా ఐటీ కారిడార్ కు గంజాయి చేరవేస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.